దేశంలోనే రెండో అతి పొడవైన తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్‌కు ఆది నుంచి తుపానుల ముప్పు ఎక్కువే.. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందంటే.. ఏపీలో తీర ప్రాంతవాసుల గుండెలు అదురుతుంటాయి. ఏటా తుపాన్లతో ఎంతో నష్టపోతోంది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం. ఇటీవలే తుపాను కాకపోయినా.. రాయలసీమను భారీ వర్షాలు ముంచెత్తాయి. చరిత్రలో ఎన్నడూ లేనంతగా వరదలు రాయల సీమను చుట్టుముట్టాయి.


ఆ వరదల నుంచి కాస్త కోలుకునే లోపే మళ్లీ జవాద్ రూపంలో మరో తుపాను ముంచుకొస్తోందన్న వార్తలు నాలుగైదు రోజుల క్రితం ఆందోళన రేపాయి. ఈ తుపాను ఉత్తరాంధ్రలోనే తీరం దాటుతుందన్న తొలి అంచనాలు భయం కలిగించాయి. ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం తప్పదేమో అనిపించింది. కానీ.. ఇప్పుడు తుపాను ముప్పు నుంచి ఉత్తరాంధ్ర పూర్తిగా బయటపడింది. తుపాను ప్రయాణ మార్గం చూస్తే.. ఉత్తరాంధ్రకు జవాద్‌ తుపాను ముప్పు తప్పినట్టు తేలిపోయింది. నిన్న సాయంత్రానికే  తీవ్ర వాయుగుండంగా బలహీనపడిన జవాద్.. ఉత్తర దిశగా ప్రయాణిస్తోంది. ఈ మధ్యాహ్నానికి ఒడిశాలోని పూరీ తీరానికి చేరే అవకాశం ఉంది.


పూరీ సమీపంలోకి చేరుకోనున్న జవాద్ తుపాన్.. మరింత బలహీనపడి వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ అధికారులు భావిస్తున్నారు. అయితే.. తుపాను బలహీనపడినా..ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం లేకపోలేదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం చెబుతోంది. జవాద్‌ తుపాన్ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పలు మండలాల్లో నిన్న ఒక మోస్తరు వానలు పడ్డాయి.


అంతే కాదు.. విజయనగరం జిల్లా చింతపల్లిలో సముద్రం 100 అడుగులకుపైగా ముందు కొచ్చింది. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. ఉప్పాడ- కాకినాడ బీచ్‌రోడ్డుపై కూడా సముద్రపు  నీరు రహదారిపై దూసుకొచ్చింది. మొత్తానికి ఏపీ తీరానికి ప్రస్తుతానికి తుపాన్ ముప్పు పూర్తిగా తప్పినట్టే.. వరుస భారీ వర్షాలు, తుపానుల నుంచి కోలుకునేందుకు కాస్త సమయం చిక్కినట్టే భావించాలి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో శాశ్వత సహాయ చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు మాత్రం అలాగే మిగిలిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: