ఏపీలో రాజ‌కీయాలు ఆసక్తిగా మారాయి. వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి కుటుంబం ఇప్పుడు ఏపీలో రెండు పార్టీల‌కు కీల‌కంగా మారింది. ఒక‌టి ఆయ‌న త‌న‌యుడు వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి సొంత కుంప‌టి పెట్టుకుని వైసీపీ ని అధికారంలోకి తీసుకువ‌చ్చారు. దీనిని క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో అధికారంలోకి తీసుకురావ‌డం ద్వారా త‌న‌కు తిరుగులేద‌ని నిరూపించారు. ఇప్పుడు కూడా అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో అదే రేంజ్‌లో ముం దుకు సాగాల‌ని నిర్ణ‌యించుకున్నారు. అయితే.. ఆయ‌న‌కు సోద‌రి వైఎస్ ష‌ర్మిల రూపంలో ప్ర‌ధాన అడ్డంకి ఎద‌రైంది.

గత ఎన్నిక‌ల్లో త‌న పార్టీని అడుగ‌డుగునా ముందుకు న‌డిపించిన ష‌ర్మిల‌.. ఇప్పుడు పొరుగు పార్టీ, తాను తీవ్రంగా విభేదించిన పార్టీ.. త‌న‌ను జైల్లో పెట్టింద‌ని చెబుతున్న పార్టీ కాంగ్రెస్‌లో చేర‌డంతోపాటు.. ఏపీలో ష‌ర్మిల‌ను అధ్య‌క్షురాలిని కూడా చేసింది. దీంతో ష‌ర్మిల గ‌త కొన్నాళ్లుగా వైసీపీపై రెచ్చిపోయి మ‌రీ విమ ర్శలు చేయ‌డం ప్రారంభించారు. వ్య‌క్తిగ‌త విష‌యాలు, వివేకా హ‌త్య‌, ఆస్తుల పంప‌కాలు.. త‌న‌ను వాడుకు ని వ‌దిలేయ‌డం వంటి అనేక విష‌యాల‌ను ష‌ర్మిల ప్ర‌స్తావించారు. దీంతో వైసీపికి ష‌ర్మిల యాంటీ అయిపోయారు.

అయితే.. అటు జ‌గ‌న్‌కు, ఇటు ష‌ర్మిల‌కు కూడా.. మ‌ధ్యేమార్గంగా ఉన్న వ్య‌క్తి వారి మాతృమూర్తి విజ‌య మ్మ‌. గ‌త 2019 ఎన్నిక‌ల్లో ఆమె జ‌గ‌న్ కోసం బైబిల్ ప‌ట్టుకుని మ‌రీ.. ప్ర‌చారం చేశారు. దీంతో జ‌గ‌న్‌కు మ‌త స్తుల ఓట్లు ప‌డ్డాయ‌నే వాద‌న కూడా ఉంది. అయితే.. ష‌ర్మిల అన్న‌తో విభేదించిన త‌ర్వాత‌.. విజ‌య‌మ్మ.. త‌న కూతురు బాగు కోసం అంటూ.. తెలంగాణ రాజ‌కీయాల‌కు ప‌రిమిత‌మ‌య్యారు. అంతేకాదు.. వైసీపీకి గౌర‌వ అధ్య‌క్షురాలిగా ఉన్న ఆమె త‌న ప‌ద‌విని కూడా వ‌దిలేసుకున్నారు.

క‌ట్ చేస్తే.. గ‌త ఏడాది కాలంలో రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు మార‌డం.. ష‌ర్మిల త‌న వైఎస్సార్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయ‌డంతో తిరిగి ఏపీపై దృష్టి పెట్టారు. ఏపీలో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువ‌చ్చేందు కు ఆమె నిరంత‌రం శ్ర‌మిస్తున్నారు. ఇలాంటి స‌మ‌యంలోనూ త‌న‌కు త‌న త‌ల్లి మ‌ద్ద‌తు ఉంటుంద‌ని ష‌ర్మిల భావించారు. ఇటీవ‌ల ఆమె త‌న‌కుమారుడి పెళ్లి జ‌రిగిన‌ప్పుడు కూడా.. అక్క‌డే ఉన్నారు. దీంతో జ‌గ‌న్‌తో రాజ‌కీయంగా విజ‌య‌మ్మ సంబంధాలు తెంచుకున్నార‌నే చ‌ర్చ జ‌రిగింది. ఇక‌, జ‌గ‌న్ ఒంట‌రి పోరేన‌ని అంద‌రూ భావించారు.

క‌ట్ చేస్తే.. ఇప్పుడు విజ‌య‌మ్మ ఎవ‌రి ప‌క్షమో తేలిపోయింది. తాజాగా సీఎం జ‌గ‌న్  వైసీపీ ఎన్నిక‌ల యా త్ర ప్రారంభించారు. ఈ యాత్ర‌లో ఆయ‌న‌ మాతృమూర్తి విజ‌య‌మ్మ భాగ‌స్వామ్య‌మ‌య్యారు. అంతేకాదు.. త‌న త‌న‌యుడు జ‌గ‌న్‌కు ముద్దు పెట్టి, ఆశీర్వ‌దించి.. యాత్ర‌ను ప్రారంభించారు. అనంత‌రం.. సీఎం జ‌గ‌న్ రాష్ట్ర వ్యాప్త అసెంబ్లీ, పార్ల‌మెంటు ఎన్నిక‌ల ప్ర‌చారానికి బ‌య‌లు దేరారు.   విజయమ్మ హైద‌రాబాద్ నుంచి నేరుగా క‌డ‌ప‌కు చేరుకుని..  జగన్ కు ముద్దు పెట్టి, ఆశీర్వదించి యాత్రకు సాగనంపారు.

దీంతో ఆమె మ‌ద్ద‌తు సంపూర్ణంగా వైసీపీకేన‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు.. కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ఇప్ప‌టికి ష‌ర్మిల రెండు ప్ర‌ధాన స‌భ‌లు నిర్వ‌హించారు. ఒక‌టి అనంత‌పురం, రెండు విశాఖ‌ప‌ట్నం. అయితే.. ఆ రెండు స‌భ‌ల‌కు విజ‌య‌మ్మ రాలేదు. సో. దీనిని బ‌ట్టి.. ఆమె త‌న మ‌ద్ద‌తు కుమారుడి వైపే ఉంద‌ని చెప్ప‌క‌నే చెప్పార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: