చంద్ర‌బాబు చివ‌రి జాబితాలో భాగంగా ఈ రోజు ప్ర‌కాశం జిల్లాలోని ద‌ర్శి అసెంబ్లీ స్ధానానికి డాక్ట‌ర్‌ గొట్టిపాటి ల‌క్ష్మి పేరు ఖ‌రారు చేశారు. ఆమె న‌ర‌సారావుపేట‌లో డాక్ట‌ర్‌గా ఉన్నారు. గొట్టిపాటి ల‌క్ష్మి ఎవ‌రో కాదు.. దివంగ‌త టీడీపీ సీనియ‌ర్ నేత, మార్టూరు మాజీ ఎమ్మెల్యే గొట్టిపాటి న‌ర‌స‌య్య‌కు స్వ‌యానా కుమార్తె. ప్ర‌స్తుత అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌కు అన్న కుమార్తె కావ‌డం విశేషం.


గొట్టిపాటి ఇంటి ఆడ‌ప‌డుచు .. న‌ర‌సారావుపేట క‌డియాల ఇంటి కోడ‌లిగా..
ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లోనే గొట్టిపాటి ఫ్యామిలీకి ఎంతో బ‌ల‌మైన రాజ‌కీయ నేప‌థ్యం ఉంది. కాక‌లు తీరిన రాజ‌కీయ యోధుడు అయిన గొట్టిపాటి హ‌నుమంత‌రావుకు ల‌క్ష్మి మ‌న‌వ‌రాలు అవుతుంది. ల‌క్ష్మి కుటుంబం న‌ర‌సారావుపేట‌లో వైద్య వృత్తిలో కొన‌సాగుతోంది. అక్క‌డ క‌డియాల కుటుంబానికి మంచి పేరు ప్ర‌ఖ్యాతులు ఉన్నాయి. ల‌క్ష్మి గైన‌కాల‌జిస్ట్‌గా కొన‌సాగుతున్నారు. న‌ర‌సారావుపేట‌లో క‌డియాల కుటుంబం ఎంతో మంది పేద‌ల‌కు ర‌క‌ర‌కాలుగా సేవ‌లు అందిస్తూ వ‌స్తోంది.


న‌ర‌సారావుపేట రేసులో కూడా...
గ‌త ఏడెనిమిది నెల‌ల నుంచి క‌డియాల ఫ్యామిలీకి ఈ సారి న‌ర‌సారావుపేట అసెంబ్లీ సీటు ఇస్తారంటూ ప్ర‌చారం జ‌రిగింది. ల‌క్ష్మి మామ క‌డియాల వెంక‌టేశ్వ‌ర‌రావు పేరు న‌ర‌సారావుపేట టీడీపీ టిక్కెట్ రేసులో తెర‌మీద‌కు వ‌చ్చింది. అయితే ఇప్పుడు చివ‌రి జాబితాలో అనూహ్యంగా క‌డియాల ఇంటి కోడ‌లు డాక్ట‌ర్ గొట్టిపాటి ల‌క్ష్మిని ఆమె సొంత జిల్లాలోని ద‌ర్శికి ఖ‌రారు చేశారు. ల‌క్ష్మికి ద‌ర్శి టీడీపీ టిక్కెట్ ఖ‌రారు చేశార‌ని తెలియ‌డంతో మార్టూరు, ప‌రుచూరు, అద్దంకితో పాటు న‌ర‌సారావుపేట‌, చిల‌క‌లూరిపేట‌, ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గాల్లోని గొట్టిపాటి అభిమానులు అంద‌రూ హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు.


చ‌క్రం తిప్పిన గొట్టిపాటి ర‌వి...
త‌న అన్న కుమార్తె అయిన ల‌క్ష్మికి ద‌ర్శి టిక్కెట్ వ‌చ్చేలా చేయ‌డంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వి పూర్తిగా చ‌క్రం తిప్పారు. ద‌ర్శి సీటు ముందుగా జ‌న‌సేన‌కు వెళుతుంద‌నుకున్నారు. ఆ త‌ర్వాత టీడీపీ నుంచి చాలాపేర్లు తెర‌మీద‌కు రావ‌డంతో పాటు ప‌లువురు నేత‌ల పేర్లుతో ఐవీఆర్ఎస్ కూడా జ‌రిగింది. ఎట్ట‌కేల‌కు డాక్ట‌ర్ ల‌క్ష్మి పేరు ఖ‌రారు కావ‌డంలో ఆమె బాబాయ్ ర‌వి వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపిన‌ట్టు తెలుస్తోంది. అవ‌స‌రం అయితే ఆర్థిక‌, ఇత‌ర‌త్రా సాయాలు చేసి ఆమెను గెలిపించే బాధ్య‌త కూడా తాను తీసుకుంటాన‌ని ర‌వి అధిష్టానంకు హామీ ఇచ్చిన‌ట్టు తెలిసింది.


డాక్ట‌ర్ ల‌క్ష్మికి ఆ రికార్డ్‌..
ఉమ్మ‌డి ప్ర‌కాశం జిల్లాలో గ‌త కొన్నేళ్ల‌లో టీడీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన మ‌హిళా అభ్య‌ర్థులు ఎవ‌రూ లేరు. అప్ప‌ట్లో సాయిక‌ల్పనారెడ్డి, జాగ‌ర్ల‌మూడి ల‌క్ష్మీప‌ద్మావ‌తి లాంటి వారు మాత్ర‌మే ఉండేవారు. అయితే చాన్నాళ్ల‌కు ఓ మ‌హిళా అభ్య‌ర్థికి టీడీపీ అవ‌కాశం ఇచ్చిన‌ట్ల‌య్యింది. ఈ ల‌క్కీ ఛాన్స్ ల‌క్ష్మికే ద‌క్కింది. ఉన్న‌త విద్యావంతురాలు, ఇటు డాక్ట‌ర్ కావ‌డంతో పాటు ద‌ర్శి ప్రాంతంలో ఎంతోమందికి ఈ కుటుంబం వైద్య సేవ‌లు చేసి ఉండ‌డం చాలా ప్ల‌స్ కానుంది. అలాగే ఒకేసారి గొట్టిపాటి ఫ్యామిలీకి ప‌క్క ప‌క్క‌నే ఉన్న ద‌ర్శి, అద్దంకి సీట్లు ఇవ్వ‌డం కూడా విశేషం.


తండ్రి న‌ర‌స‌య్య‌ది క్లీన్ పొలిటిక‌ల్ ఇమేజ్‌...
ఇక ల‌క్ష్మి తండ్రి న‌ర‌స‌య్య‌ది య‌ద్ద‌న‌పూడి మండ‌ల కేంద్రం. ఆయ‌న గ‌తంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ త‌ర్వాత 2004, 2009 ఎన్నిక‌ల్లో ఓడిపోయినా ఆయ‌న‌కు రాజ‌కీయంగా సౌమ్యుడు అన్న పేరు ఉంది. ఆ త‌ర్వాత ల‌క్ష్మి సోద‌రుడు భ‌ర‌త్ కూడా వైసీపీ నుంచి 2014లో ప‌రుచూరులో పోటీ చేశారు. ఏదేమైనా రెండు బ‌ల‌మైన కుటుంబాల నేప‌థ్యం ఉన్న డాక్ట‌ర్ ల‌క్ష్మి ద‌ర్శిలో ఖ‌చ్చితంగా విజ‌యం సాధిస్తార‌న్న అంచ‌నాలు అయితే బ‌లంగా వ‌చ్చేశాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: