ఆ మాజీ ఎమ్మెల్యే కదలికలు మరోసారి అనుమానాస్పదంగా ఉన్నట్టు ఉత్తరాంధ్ర రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. అదేంటో గానీ అధికారపక్షంలో ఉన్నప్పుడు ఆయన చాలా నమ్మకస్తుడిగా ఉంటారు .. ఆయన ఉన్న పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిందంటే చాలు పక్కచూపులు చూస్తూ ఉండటం ఆయనకు అలవాటుగా మారింది. తాను ప్రాణం ఉన్నంతవరకు జగన్ తోనే ఉంటానని బీరాలు పలికిన ఆ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు పక్క చూపులు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పక్క చూపులు చూస్తున్నట్టు సమాచారం. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన ఐదేళ్లపాటు అధికారాన్ని బాగా ఎంజాయ్ చేశారు. 2019లో తెలుగుదేశం నుంచి వరుసగా రెండోసారి గెలిచారు.. అయితే ఆ ఎన్నిక‌ల్లో పార్టీ ఓడిపోవడంతో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు.

మొన్న ఎన్నికలలో వైసిపి చిత్తశుద్ధిగా ఓడిపోయింది.. పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో ఆయన అక్కడ ఉండేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. ఈ క్రమంలోనే ఉత్తరాంధ్ర‌లో వైసిపి నష్టపోవడానికి కోఆర్డినేటర్ వ్యవస్థ కారణమని.. అది తమకు, అధినేతకు మధ్య అడ్డుగోడగా మారిందని కామెంట్ చేశారు. విజయసాయి రెడ్డి వల్ల ఒక్కో నియోజకవర్గంలో కనీసం పదివేల ఓట్లు కోల్పోయామని చెప్పారు. అలాంటి కోఆర్డినేటర్ వ్యవస్థ ఇప్పుడు కూడా అవసరమా ? అన్న అభిప్రాయం వాసుపల్లి వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే వైసీపీని వీడే ఆలోచన చేస్తున్నట్టు ఆ పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతుంది.

తాను టిడిపి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నేరుగా చంద్రబాబుతో మాట్లాడే అవకాశం ఉండేదని.. కానీ వైసీపీ అధికారంలో ఉన్నా... ప్రతిపక్షంలో ఉన్న కనీసం నియోజకవర్గ సమస్యల గురించి పార్టీ అధ్యక్షుడు జగన్‌తో డైరెక్టుగా మాట్లాడే అవకాశం లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. పైగా ఇప్పుడు విశాఖలో మరీ ముఖ్యంగా తన నియోజకవర్గంలో కూటమి చాలా బలంగా ఉంది. మొన్న ఎన్నికలలోనే జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఏకంగా 64 వేలకు పైగా మెజార్టీతో గెలవడం చూసి వాసుప‌ల్లికి భయం పట్టుకుందంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడ ఉన్న భవిష్యత్తు లేదన్న నిర్ణయానికి వచ్చే ఆయన పక్కచూపులు చూస్తున్నారంటూ విశాఖ జిల్లా రాజకీయాలలో ప్రచారం జోరుగా నడుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: