విజయవాడ రాజకీయాల్లో కేశినేని శ్రీనివాస్‌ అలియాస్‌ నాని ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే నిలుస్తుంటారు. వ్యాపారవేత్తగా పేరు తెచ్చుకున్న నాని, రాజకీయాల్లోకి వచ్చి టీడీపీ తరఫున రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. అయితే గత ఎన్నికల ముందు ఆయన టీడీపీతో విభేదించి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. సోదరుడికి ప్రాధాన్యం ఇచ్చి, తన్ను పక్కన పెట్టారని భావించి టీడీపీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరికి వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున పోటీ చేశారు. అయితే కూటమి ప్రభావం, వైసీపీ గ్రాఫ్‌ తగ్గిపోవడంతో నాని ఓటమి చవిచూశారు. పరాజయం అనంతరం రాజకీయాల నుంచి దూరంగా ఉంటానని, తన కుమార్తె కూడా రాజకీయాల్లోకి రారని స్పష్టంగా ప్రకటించారు. నిజంగానే కొంతకాలం వరకు పబ్లిక్‌గా కనబడలేదు. కానీ తాజాగా మళ్లీ రాజకీయ వ్యాఖ్యలతో యాక్టివ్‌గా మారారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ముందుకు వస్తున్నారు. ఈ పరిణామాలు వైసీపీని ఆలోచనలో ముంచాయి. నాని పార్టీని వదిలి వెళ్లిపోయినా, ఇప్పటివరకు వైసీపీపై ఒక్కసారి కూడా నోరు విప్పలేదు. పైగా అధికారంలోకి వచ్చిన కూటమినే ఎప్పుడూ టార్గెట్‌ చేస్తున్నారు.


దీన్ని బట్టి వైసీపీ వ్యూహకర్తలు మళ్లీ నానిని తమ వైపు తిప్పుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ క్రమంలో కీలక నేతల ద్వారా కేశినేనితో మమేకం కావడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ముఖ్యంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలను ఉపయోగించి నాని చుట్టూ వల వేశారని సమాచారం. నానితో వ్యాపార పరమైన సంబంధాలు ఉన్న కొందరు నేతల ద్వారా చక్రం తిప్పాలని నిర్ణయించినట్టు స‌మాచారం. వైసీపీ తాజాగా కేశినేని గ్రాఫ్‌ తగ్గలేదని, ఆయనకున్న పాపులారిటీ ఇంకా బలంగానే ఉందని అంచనా వేసింది. అందుకే వచ్చే ఎన్నికల ముందు నానిని తమ వైపు తిప్పుకోవడం వల్ల లాభం ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఈ ప్ర‌య‌త్నాల పట్ల నాని నుంచి ఇప్పటివరకు పెద్దగా స్పందన రాలేదని చెబుతున్నారు. అయినప్పటికీ ఎన్నికల సమయానికి ఆయనను ఆకర్షించేందుకు వైసీపీ శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  మొత్తానికి కేశినేని నాని మళ్లీ వైసీపీలో చేరతారా? లేక  కొత్త దారి ఎంచుకుంటారా ? అన్న‌ది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: