తెలంగాణ సీఎంగా కేసీఆర్ వ‌రుస‌గా రెండోసారి గెలిచారు. తెలుగు రాష్ట్రాల్లో అప్పుడెప్పుడో జ‌ల‌గం వెంగ‌ళ‌రావు సీఎం అయ్యాక మ‌ళ్లీ కేసీఆరే ఈ సామాజిక‌వ‌ర్గం నుంచి సీఎం అయ్యారు. కేసీఆర్ వ‌రుస విజ‌యాల‌తో తెలంగాణ‌లో వెల‌మ సామాజిక‌వ‌ర్గం రాజ‌కీయంగాను, అన్ని విధాలా ఆధిప‌త్యం చెలాయిస్తుందోన్న టాక్ ఉండ‌నే ఉంది. 


కేసీఆర్ తొలి కేబినెట్‌లో మొత్తం 17 మందిలో సీఎంతో క‌లుపుకుంటే న‌లుగురు వెల‌మ‌లు మంత్రులుగా ఉన్నారు. హ‌రీష్‌రావు, కేటీఆర్‌తో పాటు జూప‌ల్లి కృష్ణారావు మంత్రులుగా ఉన్నారు. ఇక ఇప్పుడు జూప‌ల్లి ఓడిపోవ‌డంతో వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్‌రావును కేబినెట్‌లోకి తీసుకున్నారు. కేసీఆర్ త్వ‌ర‌లో చేసే కేబినెట్ విస్త‌ర‌ణ‌లో హ‌రీష్‌రావు, కేటీఆర్‌కు ఖ‌చ్చితంగా మంత్రి ప‌ద‌వులు ఇస్తార‌ని అంటున్నారు.


ఇప్ప‌టికే ఐదుగురు రెడ్ల‌కు మంత్రి ప‌ద‌వులు ఇచ్చారు. ఇప్పుడు మ‌రో బెర్త్‌ను త‌నకు అత్యంత స‌న్నిహితుడు అయిన త‌న సామాజిక‌వ‌ర్గానికే చెందిన వ్య‌క్తికి క‌ట్టబెడుతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇంత‌కు ఆ నేత ఎవ‌రో కాదు మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌. తెలంగాణ ఉద్యమంలో ఆయన గులాబీ రథసారథికి అడుగడుగునా అండగా నిలిచారు. 2014లో గెలిచి ఎంపీగానూ ఢిల్లీలో చక్రంతిప్పారు. తాజా ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్థి బండి సంజ‌య్ చేతిలో ఓడిపోయారు. రాజ‌కీయంగా ఇది ఆయ‌న‌కు పెద్ద ఎదురు దెబ్బే.


ఈ క్ర‌మంలోనే ఇప్పుడు వినోద్‌కు కేసీఆర్ బంప‌ర్ ఆఫ‌ర్ ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది. వినోద్‌ను కేబినెట్‌లోకి తీసుకోవాలని కేసీఆర్‌ ఆలోచిస్తున్నట్టు తెలంగాణ భవన్‌లో చర్చ జరుగుతోంది. ఎంపీగా ఓడిపోయిన వినోద్‌కు ఎమ్మెల్సీ ఇచ్చి, మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న‌దే గులాబీ బాస్ టార్గెట్ అట‌. అయితే ఇప్ప‌టికే కేసీఆర్ కేబినెట్‌లో ఎర్ర‌బెల్లి ఈ వ‌ర్గం నుంచి మంత్రిగా ఉన్నారు. కేటీఆర్‌, హ‌రీష్‌ను త‌ప్ప‌కుండా కేబినెట్‌లోకి తీసుకోవాలి.. ఇప్పుడు వినోద్‌ను కూడా తీసుకుంటే ఆయ‌న‌పై క్యాస్ట్ ఫీలింగ్ చూపిస్తున్నార‌న్న విమ‌ర్శ‌లు వ‌స్తాయ‌న్న చ‌ర్చ‌లు తెలంగాణ రాజ‌కీయ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. మ‌రి కేసీఆర్ అంతిమంగా ఏం చేస్తారో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: