
ఇప్పుడు కేసీఆర్ జాతీయ రాజకీయాల కోసం ప్రత్యేకంగా ఓ టీమ్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ టీమ్‌లో టీఆర్ఎస్‌కు చెందిన ముఖ్య నేతలు, మేధావులకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. పార్టీకి చెందిన ఎంపీలతో పాటు కొందరు చురుకైన ఎమ్మెల్యేలు, నేతలకూ ఈ టీమ్‌లో అవకాశం కల్పిస్తారు. అలాగే కేవలం రాజకీయ నాయకులే కాకుండా మేధావులు, విద్యావేత్తలు, సాహితీవేత్తలు, మాజీ ఐఏఎస్‌లు, మాజీ ఐపీఎస్‌లకు కూడా కేసీఆర్ జాతీయ బృందంలో చోటు కల్పించే అవకాశం కనిపిస్తోంది.
రాజకీయ నేతలు, మేధావులతో పాటు కళాకారుల సేవలను కూడా వినియోగించుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆయన ముంబయి పర్యటన సందర్భంగా కొన్ని సంకేతాలు ఇచ్చారు. ఆయన ముంబయి పర్యటనలో మంత్రులు, సీనియర్ నేతలతో కాకుండా ఎంపీలు, ఎమ్మెల్సీలు వెళ్లారు. ముంబయి టూర్‌లో నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్ లా నాలుగైదు భాషల్లో పట్టు ఉండి.. బీజేపీ వ్యతిరేక వాదాన్ని బలంగా వినిపించే వారి కోసం కేసీఆర్ అన్వేషిస్తున్నారు.
అలాంటి వారు పార్టీలో ఉన్నా.. బయట ఉన్నా.. తనతో కలుపుకుని పోయేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో పనిచేసేందుకు కేసీఆర్ సమర్థులైన వారిని ఎంపిక చేసుకోనున్నారు. జాతీయ స్థాయిలో టీవీ ఛానళ్లలో చర్చల్లో పాల్గొనే సత్తా ఉన్న వారిని కూడా ఆయన ఎంపిక చేయనున్నారు.