తాపడాలు తొలగించి 45 రోజుల తర్వాత చెన్నైలోని ఒక ప్రైవేట్ సంస్థకు పంపడం, తర్వాత వాటిలో బరువు తగ్గడం వంటి అంశాలు తీవ్ర అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారుల పాత్రపై కోర్టు నేరుగా ప్రశ్నలు లేవనెత్తింది. ఆలయ ఆస్తులు, బంగారం వంటి విలువైన వస్తువులపై ఇంత నిర్లక్ష్యం ఎలా జరుగుతుందంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును కేవలం ఒక పరిపాలనా తప్పిదంగా తీసుకోలేమని, ఇందులో దోపిడీ, అవినీతి అవకాశాలు ఉన్నాయని న్యాయస్థానం సూచించింది. వెంటనే విజిలెన్స్ విభాగానికి ఈ కేసుపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, అన్ని ఆధారాలను సేకరించి, సంబంధిత అధికారులపై దర్యాప్తు జరిపి వివరాలు కోర్టుకు సమర్పించాలని స్పష్టం చేసింది.
హైకోర్టు ఈ విచారణను సెప్టెంబర్ 30కి వాయిదా వేసింది. అప్పటివరకు విజిలెన్స్ శాఖ ప్రాథమిక నివేదికను సమర్పించాలని ఆదేశించింది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో భక్తుల్లో తీవ్ర ఆగ్రహం ఉద్భవించింది. అయ్యప్ప స్వామి ఆలయంలో ఇంత పెద్ద ఎత్తున బంగారం మాయం కావడం విశ్వాసానికి దెబ్బ అని భక్తులు మండిపడుతున్నారు. ఇక సోషల్ మీడియాలోనూ ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. “దేవుడి గూడి కూడా మాఫియా నుంచి సేఫ్ కాదు” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ కేసులో నిజం బయట పడుతుందా ? బంగారం ఎక్కడికి మాయమైంది? అన్నది ఇప్పుడు కేరళలోనే కాకుండా మొత్తం దేశం ఆసక్తిగా గమనిస్తోంది. శబరిమల అయ్యప్ప ఆలయంలో బంగారం మాయం కేసు – భక్తుల నమ్మకంపై దెబ్బ, అధికారులు నిదానంగా వ్యవహరించడం వివాదాస్పదం.