ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరఫున తన మాయాజాలంతో అదరగొట్టిన యంగ్ సెన్సేషన్, మిస్టరీ స్పిన్నర్ దిగ్వేశ్ రథి, ఇప్పుడు మరో అద్భుతంతో వార్తల్లో నిలిచాడు. ఐపీఎల్‌లో మెరిసిన ఈ కుర్రాడు, ఇప్పుడు లోకల్ క్రికెట్‌లోనూ తన విశ్వరూపం చూపిస్తున్నాడు.



తాజాగా ఓ స్థానిక టీ20 మ్యాచ్‌లో ఈ యువ కెరటం సృష్టించిన విధ్వంసం మామూలుగా లేదు. వరుసగా ఐదు బంతుల్లో ఐదు వికెట్లు పడగొట్టి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. ఈ అద్భుత దృశ్యాన్ని లక్నో సూపర్ జెయింట్స్ తమ అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో "దిగ్వేశ్ రథి. 5 స్టార్స్" అంటూ ఓ రేంజ్‌లో పోస్ట్ చేయగా, జట్టు యజమాని సంజీవ్ గోయెంకా సైతం తన ఆనందాన్ని ఆపుకోలేకపోయారు.

"స్థానిక టీ20 మ్యాచ్‌లో దిగ్వేశ్ రథి 5 బంతుల్లో 5 వికెట్లు తీయడం చూశాను. ఐపీఎల్ 2025లో అతను ఎందుకంత సంచలనంగా మారాడో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే" అని గోయెంకా ఉప్పొంగిపోయారు.

ఆ వీడియోలో ప్రత్యర్థి జట్టు 36 బంతుల్లో 113 పరుగులు చేయాల్సిన క్లిష్ట పరిస్థితుల్లో ఉండగా, రథి బౌలింగ్‌కు దిగాడు. ఇక అంతే, తన మాయదారి గూగ్లీలతో బ్యాటర్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. చూస్తుండగానే నలుగురు బ్యాటర్లు క్లీన్ బౌల్డ్ కాగా, మరొకరు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగారు. ఈ మ్యాచ్‌లో మొత్తం ఏడు వికెట్లు పడగొట్టి తన సత్తా ఏంటో మరోసారి నిరూపించాడు ఈ లక్నో బుల్లెట్.

గత ఐపీఎల్ సీజన్‌లో (2025) లక్నో తరఫున 13 మ్యాచ్‌లు ఆడిన ఈ యువ సంచలనం, 14 వికెట్లతో పాటు పరుగుల ప్రవాహాన్ని అరికట్టడంలోనూ, కీలక సమయాల్లో వికెట్లు తీయడంలోనూ తనదైన ముద్ర వేశాడు. ఆ సీజన్‌లో వెలుగులోకి వచ్చిన భవిష్యత్ తారల్లో రథి ఒకడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

ఇక, మైదానంలో వికెట్లు పడగొట్టడమే కాదు, తనదైన 'నోట్‌బుక్ సెలబ్రేషన్'తో కూడా రథి బాగా పాపులర్ అయ్యాడు. వికెట్ తీసిన ప్రతీసారి ఓ చిన్న నోట్‌బుక్‌లో ఏదో రాసుకుంటున్నట్లు చేసే ఈ వినూత్న సంబరం అభిమానులను ఆకట్టుకుంది. అయితే, ఈ సెలబ్రేషన్ కారణంగా ఐపీఎల్ సమయంలో పలుమార్లు భారీ జరిమానాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది మనోడికి.

ఏదేమైనా, ఐపీఎల్‌లో మెరిసి, ఇప్పుడు స్థానిక క్రికెట్‌లోనూ అదే జోరు కొనసాగిస్తున్న దిగ్వేశ్ రథి, భవిష్యత్తు భారత క్రికెట్‌కు ఓ ఆశాకిరణం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కుర్రాడి దూకుడు చూస్తుంటే, త్వరలోనే టీమిండియా జెర్సీలో చూడటం ఖాయమనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: