
మనలో ప్రతి ఒక్కరికీ జనగణమన రాసింది.. రవీంద్ర నాథ్ ఠాగూర్ అని, వందేమాతరం రాసింది.. బంకించంద్ర చటర్జీ అని ప్రతి ఒక్క భారతీయుడుకి నాటి నుంచి నేడు చదువుతున్న చిన్న పిల్లలకు వరకూ కూడా తెలుసు. కానీ ప్రతిరోజూ ఉదయం ప్రతి పాఠశాలలోనూ.. భారత దేశము నా మాతృభూమి.. భారతీయులందరూ నా సహోదరులు.. అంటూ చేసే ప్రతిజ్ఞ రాసింది ఎవరో మాత్రం చాలామందికి మనలో తెలియదు. ప్రతి పాఠ్య పుస్తకం మీద మొదటి పేజీలో ఈయన ప్రతిజ్ఞ ఉంటుంది. కానీ అది ఎవరు రాశారో మాత్రం, ఆ కవి పేరు ఇక్కడ కనిపించదు. అయితే ఆ గేయాన్ని రాసింది ఎవరో కాదు శ్రీ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు.

ఈయన చనిపోయి దాదాపు 33 సంవత్సరాలు అవుతున్నప్పటికీ, ఇప్పటికీ ప్రతి పాఠశాలలో ప్రతి విద్యార్థి నోట వినిపించడం మహా అద్భుతం. ఈరోజు ప్రముఖ ప్రజ్ఞాశాలి రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి జయంతి. భారత జాతీయ ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు నల్గొండ జిల్లా, అన్నెపర్తి గ్రామంలో 1916 వ సంవత్సరం జూన్ పదవ తేదీన వెంకటరామయ్య - రాంబాయమ్మ దంపతులకు జన్మించారు. ఈయన విద్యాభ్యాసం మొత్తం నల్లగొండ జిల్లాలోనే కొనసాగింది.

తెలుగు, ఆంగ్లం, హిందీ, సంస్కృతం,అరబిక్ భాషలలో కూడా ప్రావీణ్యం పొందిన సుబ్బారావు గారు తన 18వ సంవత్సరంలోనే కాలభైరవుడు అనే నవల కూడా రాశారు. ఇక నాటి వెట్టిచాకిరీ వ్యవస్థను వ్యతిరేకిస్తూ అనేక కథలు కూడా రాశారు ఈయన. సుబ్బారావు గారు ఉద్యోగరీత్యా ఖజానా అధికారిగా పనిచేస్తున్న సమయంలో, 1962లో విశాఖలో వృత్తి నిర్వహణలో ఉన్నప్పుడు, భారత-చైనా యుద్ధం జరిగిన సందర్భంగా నాటి కేంద్ర పాలకులు పిల్లల్లో జాతీయ భావం పెంపొందించడానికి దేశభక్తి రచనలను బాలలకోసం వ్రాయమని పిలుపునిచ్చారు


ఇక ఆ పిలుపుతో వెంకట సుబ్బారావు గారు ఈ ప్రతిజ్ఞ వ్రాయడం జరిగింది. అది తెన్నేటి సూరి గారి ద్వారా బాధితులకు చేరింది. ఇక్కడ దురదృష్టకర విషయం ఏమిటంటే ఈ విషయం పైడిమర్రి సుబ్బారావు గారికి తెలియకుండానే, ఆయన రచించిన ప్రతిజ్ఞ భారతీయ భాషల్లోకి అనువాదమై, 1965 జనవరి 26వ తేదీ నుండి పాఠ్య పుస్తకాలలో ప్రచురించబడింది. ఈయనకు తెలియకుండానే వెంకట సుబ్బారావు గారి పేరు భారతదేశమంతటా మారు మ్రోగింది. కానీ ఈయనకు ఈ విషయం తెలియదు. ఇక 1988 ఆగస్టు 13వ తేదీన స్వర్గస్తులయ్యారు. అనంతర కాలంలో పరిశోధకుల, పోరాట కారుల, కృషితో ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి చరిత్రకెక్కారు.

భారతీయులందరు నా సహోదరులు, సోదరీమణులు
నేను నా దేశమును ప్రేమించుచున్నాను.
సుసంపన్నమైన, బహువిధమైన నాదేశ వారసత్వసంపద నాకు గర్వకారణము.
దీనికి అర్హుడనగుటకై సర్వదా నేను కృషి చేయుదును.
నా తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను, పెద్దలందరిని గౌరవింతును.
ప్రతివారితోను మర్యాదగా నడచుకొందును.
నా దేశముపట్లను, నా ప్రజలపట్లను సేవానిరతి కలిగియుందునని ప్రతిజ్ఞ చేయుచున్నాను.