పాలకుల విశాల దృక్పథంతోనే అభివృద్ధి సాధ్యం. రాజకీయాలతో ముడి పెట్టకుండా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షిస్తేనే పరిశ్రమలు, ఐటీ సంస్థలు ఏర్పాటకు మార్గం సుగుమం అవుతుంది. రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. అయితే వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత ఇలాంటి వాతావరణం లేదనేది కొందరి వాదన. అయితే ఇదంతా ఎల్లో మీడియా విష ప్రచారం అని వైసీపీ మంత్రులు కొట్టి పడేస్తుంటారు.


మరోవైపు ఏపీకి పలు కంపెనీలు వస్తున్నా వాటికి అంతగా ప్రచారం కల్పించకపోవడంతో నిజగంగా కంపెనీలు రావడం లేదా అనే సందేహాలు అటు ప్రజల్లో ఇటు యువతలో వ్యక్తమవుతుంది. గతంలో చంద్రబాబు హయాంలో ఒక  కంపెనీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినా.. దానికి భారీ పబ్లిసిటీ ఇస్తూ పతాక స్థాయిలో వార్తలు రాసేవారు. ఇప్పుడు ప్రముఖ కంపెనీలు అయిన ఇన్పోసిస్ వంటి సంస్థలు వచ్చినా లోపలి పేజీల్లోకి వెళ్లిపోతున్నాయి.


వీటిని పక్కన పెడితే తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద ఏసీ తయారీ సంస్థ జపాన్ కి చెందిన డైకిన్ ఇక నుంచి మేడిన్ ఆంధ్రా ఏసీలను విక్రయించనుంది. ఈ మేరకు పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా శ్రీ సిటీలోని జపాన్ కంపెనీ ప్రతినిధులు రాయబారుల సమక్షంలో ఇవాళ  లాంఛనంగా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు.


రూ.1000 కోట్ల పెట్టుబడితో 75.5 ఎకరాల విస్తీర్ణంలో డైకిన్ ఈ యూనిట్ ని స్థాపించింది. గతేడాది ఏప్రిల్ లో నిర్మాణ పనులు చేపట్టిన డైకిన్ సంస్థ రికార్డు స్థాయిలో 18 నెలల్లోనే యూనిట్ ని సిద్ధం చేసింది. తొలిదశలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్ లో ఏటా 10లక్షల ఏసీలను తయారు చేసే సామర్థ్యం కలిగి ఉంది. దీనిద్వారా ప్రత్యక్షంగా సుమారు 3000మందికి ఉపాధి లభించనుంది. 2020-21లో డిప్లమో పూర్తి చేసుకున్న విద్యార్థులకు తమ సంస్థలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించామని డైకిన్ తెలిపింది. ఎంపికైన వారికి రూ.1.99లక్షల వార్షిక వేతనం అందిస్తున్నట్లు వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: