తెలంగాణలో ప్రవేశ పరీక్షలకు ఉన్నత విద్యా మండలి కన్వీనర్లను ప్రకటించింది. ఎడ్‌సెట్‌ మినహా అన్ని ఎంట్రన్సులకు కొత్త కన్వీనర్లను నియమించింది. అంతే కాదు.. ప్రవేశ పరీక్షలు నిర్వహించనన్న విశ్వవిద్యాలయాలను కూడా ఖరారు చేసింది. ఇంజినీరింగ్, ఫార్మా కోర్సుల కోసం నిర్వహించే ఎంసెట్‌ బాధ్యతలను ఈ ఏడాది కూడా ఉన్నత విద్యా మండలి జేఎన్టీయూహెచ్‌కే అప్పగించింది. ఎంటెక్, ఎంఫార్మా కోర్సుల కోసం పీజీఈసెట్ ఇంతకు ముందు ఓయూ నిర్వహిస్తే ఇప్పుడు ఆ బాధ్యతను ఈ ఏడాది జేఎన్టీయూహెచ్‌కి అప్పగించారు.


బీఈడీ ప్రవేశాల కోసం ఎడ్‌సెట్‌ ను గతేడాది ఓయూ నిర్వహించింంది. ఈ సారి మహాత్మగాంధీ విశ్వవిద్యాలయానికి ఆ బాధ్యతను అప్పగించారు. కన్వీనర్ గా ఓయూ ప్రొఫెసర్ ఎ.రామకృష్ణ ఈ ఏడాది కూడా కొనసాగుతారు. వ్యాయామ కోర్సుల ప్రవేశాల కోసం పీఈసెట్ ను గతేడాది మహాత్మగాంధీ వర్సిటీ చేపట్టింది. ఈ విద్యా సంవత్సరానికి శాతవాహన విశ్వవిద్యాలయానికి ఉన్నత విద్యా మండలి బాధ్యతను అప్పగించింది.


పీఈసెట్ కొత్త కన్వీనర్‌గా ఓయూ ఫిజికల్ డిపార్ట్‌మెంట్‌ ప్రొఫెసర్ రాజేష్ కుమార్ ను  ఉన్నత విద్యా మండలి నియమించింది. అలాగే పీజీఈసెట్ కొత్త కన్వీనర్‌గా జేఎన్టీయూహెచ్ గణితం విభాగం ప్రొఫెసర్ బి.రవీందర్‌రెడ్డిని నియమించారు. ఎంబీఏ, ఎంసీయే ప్రవేశాల కోసం ఐసెట్‌ ఈ ఏడాది కూడా కాకతీయ యూనివర్సిటీనే నిర్వహించబోతోంది. కన్వీనర్‌గా కేయూ కామర్స్ విభాగం ప్రొఫెసర్ పి.వరలక్ష్మి వ్యవహరిస్తారు.


ఇక పాలిటెక్నిక్ అభ్యర్థులు ఇంజినీరింగ్ రెండో సంవత్సరంలో చేరేందుకు ఈసెట్‌ను గతేడాది జేఎన్టీయూహెచ్ నిర్వహించింది. ఈసారి ఆ బాధ్యతను ఓయూకి అప్పగించారు. ఈసెట్‌ కొత్త కన్వీనర్‌గా ఓయూ ఇంజినీరింగ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ ను నియమించారు. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాల కోసం లాసెట్, పీజీఎల్‌సెట్ ను ఈ ఏడాది కూడా ఓయూ నిర్వహించబోతోంది.  మే, జూన్‌ నెలలో ప్రవేశ పరీక్షలన్నీ నిర్వహించాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. త్వరలో తేదీలను ప్రకటించే అవకాశం ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

cet