''స్వతహాగా హాస్య ప్రధానమైన సినిమాల్ని ఇష్టపడతా. ఆ ఇష్టమే 'ప్రిన్స్‌' చేయడానికి కారణమైంది'' అన్నారు తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్‌.చిన్న పాత్రలతో ప్రయాణం మొదలుపెట్టిన ఆయన... స్టార్‌గా ఎదిగారు. తెలుగులోనూ మార్కెట్‌ని సొంతం చేసుకున్నారు. 'రెమో' మొదలుకొని 'వరుణ్‌ డాక్టర్‌', 'కాలేజ్‌ డాన్‌' సినిమాలతో ఆయన తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. ఇటీవల తెలుగు దర్శకుడు అనుదీప్‌.కె.వి.తో కలిసి 'ప్రిన్స్‌' చేశారు. ఆ చిత్రం ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా శివ కార్తికేయన్‌ హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...''నవ్వడం అన్నా, నవ్వించడం అన్నా చాలా ఇష్టం. అరగంట కూడా నవ్వకుండా ఉండలేను. అయితే ఈమధ్య కామెడీ ప్రధానమైన కథలు తగ్గిపోతున్నాయి. ఇలాంటి సమయంలోనే ఓ స్నేహితుడి వల్ల అనుదీప్‌ని కలిశా. ఆయన చెప్పిన కథ చాలా నచ్చింది. హాస్యం, సంభాషణలు అత్యంత సహజంగా అనిపించాయి. అలా మొదలైన ఆ ప్రయాణమే 'ప్రిన్స్‌'గా మారింది. చిన్న పిల్లల్లో కనిపించే అమాయకత్వం ఇందులోని అన్ని పాత్రల్లోనూ ప్రతిబింబిస్తుంది. అదే నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిన విషయం. బ్రిటిష్‌ అమ్మాయి ప్రేమలో పడిన ఓ యువకుడి చుట్టూ సాగే కథ ఇది. భాషతో సంబంధం లేకుండా అందరికీ వినోదం పంచే అంశాలున్న కథ''.'మొదట ఈ సినిమాని రెండు భాషల్లో చేయాలనుకున్నాం. కానీ భాష తెలియకుండా కామెడీ చేయడం చాలా కష్టం. పైగా కామిక్‌ టైమింగ్‌కి ప్రాధాన్యమున్న కథ ఇది. దాంతో ఈ సినిమాని తమిళంలోనే చేయాలనుకున్నాం. ఈ కథ ప్రత్యేకత ఏమిటంటే... దర్శకుడు తెలుగులో రాసుకున్నారు, తమిళంలో తెరకెక్కించారు. ఆ కోణంలో మాత్రం ఇది ద్విభాషా చిత్రమే. భాషపై పట్టు లేనప్పుడు డబ్బింగ్‌ చెప్పకూడదు. తెలుగు అర్థం అవుతుంది, కొంచెం కొంచెం మాట్లాడతాను. అయినా సరే, కామెడీ ప్రధానమైన ఈ కథకి ఇది సరిపోదని నేనే డబ్బింగ్‌ చెప్పలేదు.''.
'కథల ఎంపిక సమయంలో నా ఆలోచనలన్నీ వర్తమానంలోనే ఉంటాయి. గత సినిమాలో బాగా నవ్వించాను కదా, మళ్లీ అదే అంశాలతో సినిమా చేద్దామని అక్కడే ఆగిపోను. భవిష్యత్తులో ద్విభాషా చిత్రాలు విస్తృతంగా చేస్తా. రెండు పరిశ్రమలు కలిసి సినిమాలు చేయడం మంచి పరిణామం. భాషల మధ్య హద్దులు చెరిగిపోవడంతో ఇప్పుడు దక్షిణాది చిత్రసీమలో భిన్న కలయికల్లో సినిమాలొస్తున్నాయి. నాకు తెలుగులో రాజమౌళి, త్రివిక్రమ్‌, సుకుమార్‌ సినిమాలంటే చాలా ఇష్టం''.

మరింత సమాచారం తెలుసుకోండి: