మనషుల మధ్య బంధాలు ఆత్మీయతలు బాగా తగ్గిపోవడంతో పెద్దపెద్ద నగరాలతో పాటు మధ్య తరహా పట్టణాలలో కూడ పెరిగిపోతున్న అద్దె బంధువుల సందడి వ్యాపారం అనేక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలకు కాసులు కురిపిస్తున్నట్లు ఒక సర్వే తెలియచేసింది. నగరాలలో అదేవిధంగా పట్టణాలలో జరిగే పెళ్ళిళ్ళ కార్యక్రమాలకు కానీ లేదా చావులకు సంబంధించిన కార్యక్రమాలకు కానీ బంధువులు స్నేహితులు చాల తక్కువగా ఉన్నవాళ్ళు ఇలాంటి అద్దె బంధుత్వాల కోసం ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది.


ఇలాంటి కల్చర్ నగరాలలో పట్టణాలలో కొత్తగా రావడానికి కొన్ని ఆసక్తికర కారణాలు కనిపిస్తున్నాయి. సంపద కీర్తి ఎంత ఉన్నా కొందరి ఇళ్ళల్లో జరిగే కార్యక్రమాలకు వారి దగ్గర బంధువులు కూడ రావడం మానేశారు. ముఖ్యంగా ఈ కరోనా పరిస్థితులు ఏర్పడిన తరువాత ఆవంకతో బంధువుల రాక బాగా తగ్గిపోయింది.


దీనితో తమ ఇళ్ళల్లో జరిగే ఫంక్షన్స్ కళావిహీనంగా ఉండ కూడదని చాలామంది ఇలా అద్దె బంధువుల వైపు మొగ్గు చూపుతున్నారు. మనకు నచ్చిన ఏదైనా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని సంప్రదించి మనకు కావలసిన అద్దె బంధువుల సంఖ్యను తెలిపితే ఆ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డ్రెస్ కోడ్ తో సహా పెళ్ళిళ్ళలో సందడి చేసేందుకు రెండు వందలు అంతకు మించి లేదంటే తక్కువ సంఖ్యలో అద్దె బంధువులను రెడీ చేసి పంపే బిజినెస్ ఇప్పుడు భాగ్యనగరంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతోందని ఒక ప్రముఖ పత్రిక తన కథనంలో తెలియచేసింది.


ఇలా అద్దె బంధువులు సొంత మనుష్యులు లా నటించడానికి ఆరు గంటల పనికి 1000 నుండి 1500 ల వరకు వారికి సర్వీస్ ఛార్జీలు ఇచ్చుకోవలసిన పరిస్థితి. ముఖ్యంగా కాస్తో కూస్తో డబ్బున్న కుటుంబాలలో పెద్దవాళ్ళు మరణించినప్పుడు వారిని స్మశానం వరకు సాగనింపడానికి చాల కుటుంబాలలో జనం కరువైపోతున్న పరిస్థితులలో ఈ అద్దె బంధువులే దిక్కు అవుతున్నారని ఆకథనం పేర్కుంది. ఏది ఏమైనా ఈ అద్దె బంధువుల బిజినెస్ కొన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలకు కాసులు కురిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: