
తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన బీఆర్ఎస్ నాయకుడు మల్లారెడ్డి, తెలుగు రాష్ట్రాల రాజకీయాలు, ఆర్థిక పరిస్థితులపై తన అభిప్రాయాలను స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి చెందుతోందని మల్లారెడ్డి అభినందించారు. ప్రధాని నరేంద్ర మోదీతో కేంద్రంలో సత్సంబంధాలు ఉండడం వల్ల ఏపీకి వేల కోట్ల నిధులు వస్తున్నాయని, ఇది రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతోందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఏపీ పట్ల సానుకూలంగా ఉన్నారని, అందుకే కూటమి ప్రభుత్వానికి కేంద్రం నుండి పూర్తి సహాయ సహకారాలు అందుతున్నాయని ఆయన వివరించారు.
తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పడిపోయిందని మల్లారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో హైదరాబాద్‌లో భూముల ధరలు రికార్డు స్థాయిలో ఉండేవని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి దిగజారిందని ఆయన ఆరోపించారు.
తెలంగాణలో పరిస్థితి మెరుగుపడాలంటే మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మల్లారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనలోనే తెలంగాణ అభివృద్ధి పథంలో నడిచిందని, రియల్ ఎస్టేట్, ఇతర వ్యాపారాలు పుంజుకున్నాయని ఆయన గుర్తుచేశారు. మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తేనే తెలంగాణ పూర్వ వైభవాన్ని పొందుతుందని ఆయన అన్నారు.
ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని ఆస్తులను అమ్మి తెలంగాణలో భూములు కొనేవారని, కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైందని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో ఆస్తులు అమ్మి ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎంతగా దెబ్బతిందో తెలియజేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు