
ఈ నెలలో ఒక తారీఖు అనుకొని తలాక్ చెప్తే మళ్లీ వచ్చేనెల ఇదే తేదిన చెప్పాలి. ఇలా మూడు సార్లు చేయాలి. ఈ మధ్యలో పెద్దలు వారికి కౌన్సెలింగ్ ఇస్తుంటారు. అమ్మాయి గర్భం దాల్చినా, పీరియడ్స్ వచ్చినా తలాక్ చెప్పకూడదు. మళ్లీ వచ్చే నెల లెక్కలోకి తీసుకోవాలి. ఇలా మూడుసార్లు చెప్తే వారికి విడాకులు మంజూరవుతాయి. పెళ్లి సమయంలో పెట్టుకున్న నిఖానామా వారికి ఇచ్చేస్తారు. ఇది వారి పద్ధతి.
అయితే ఒకేసారి ట్రిపుల్ తలాక్ చెప్పి విడాకులు ఇవ్వడం సరైనది కాదంటూ ప్రధాని మోదీ సర్కారు ట్రిపుల్ తలాక్ బిల్లును తీసుకువచ్చి చట్ట సభల్లో ఆమోదింపజేసింది. ఒకేసారి ట్రిపుల్ తలాక్ చెప్పడం నేరంగా భావించి అందులో మార్పులు చేసింది.
అయినా కొంతమంది మారడం లేదు. కేరళకు చెందిన రషీద్ వాట్సాప్ లో తన భార్యకు విడాకులు ఇచ్చాడు. విదేశాల్లో ఉంటున్న అతను తన భార్య గర్భం దాల్చడంతో ఇండియాకు పంపించాడు. ప్రసవ సమయంలో ఆమె అతడిని ఇక్కడికి రావాలని కోరింది. అతను నిరాకరించడంతో వాగ్వాదం జరిగింది. ఆగ్రహించిన అతను ఆమెకు వాట్సాప్ లో మూడు సార్లు తలాక్ చెప్పాడు. దీంతో సలీయా ఇప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ చట్టం లేకపోతే ఆమెకు ఏ అవకాశం ఉండేది కాదు.