వరవరరావు.. పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు.. విప్లవ రచయితల సంఘానికి చెందిన వరవరరావు నక్సలిజాన్ని ప్రోత్సహిస్తున్నారన్న అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఏకంగా ప్రధానిపైనే హత్యాయత్నం జరిగిన కేసులో ఆయనకు సంబంధం ఉందన్న ఆరోపణలపై ఆయన జైలు పాలయ్యారు.     విచారణ సాగుతూనే ఉంది. అయితే కరోనా, అనారోగ్యం వంటి కారణాలతో ఆయన్ను విడుదల చేయాలన్న డిమాండ్ తెలుగురాష్ట్రాల్లో పెరుగుతోంది.

ఇప్పటికే అనేక మంది మేధావులు ఈ డిమాండ్ చేశారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి కూడా వరవరరావును విడుదల చేయించే విషయంలో చొరవ తీసుకోవాలంటూ ఉప రాష్ట్రపతి వెంకయ్యకు లేఖ రాశారు. ఇప్పుడు ఈ అంశంపై బీజేపీ- వైసీపీ మధ్య మాటలయుద్ధానికి దారి తీస్తోంది. భూమన అలా లేఖ రాయడాన్ని బీజేపీ తప్పుబడుతోంది. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ సునీల్ దేవధర్ భూమన వైఖరిని ఖండించారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన తీవ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉన్న వరవరరావుకు అనుకూలంగా ఎలా ఉత్తరం రాస్తారని ప్రశ్నించారు.


అసలు ఈ విషయం ముఖ్యమంత్రి జగన్ కు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. భూమన ప్రజలకు క్షమాపణ చెప్పాలని సునీల్ డిమాండ్ చేశారు. వరవరరావు హార్డ్ కోర్ నక్సలైట్ అని ఆయన అంటున్నారు. దీనిపై భూమన కూడా స్పందించారు. వరవరరావు ఎనభై ఒక్క ఏళ్ల వయసులో ఉన్నందున, అనారోగ్యంతో ఉన్నందున ఆయన పట్ల జాలి చూపమన్నానే తప్ప.. ఆయన భావజాలాన్ని అంగీకరించడం కాదని భూమన స్పష్టం చేశారు. తాను హింసకు వ్యతిరేకమని భూమన స్పష్టం చేశారు.

ప్రధాని మోడీ పట్ల తనకు గౌరవం, ప్రేమ ఉన్నాయని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తాను  సనాతన ధర్మాన్ని గౌరవిస్తానని భూమన చెప్పారు. తాను వ్యక్తిగతం అభిప్రాయంగా చెబితే దానిని ముఖ్యమంత్రి జగన్ కు ముడిపెట్టి కామెంట్ చేయడం సరికాదని భూమన అంటున్నారు. మొత్తానికి వరవరరావు విడుదల అంశం ఈ రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారి తీసిందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: