కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఏపీ సీఎం జగన్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్టు ప్రకటించడం కూడా రాజకీయ విమర్శలకు దారి తీయడం కలకలం రేపుతోంది. సాధారణంగా నాయకులు తమ పార్టీ నేతల పేర్లో.. తమకు రాజకీయ లబ్ది చేకూరే వారి పేర్లో పథకాలకు, ప్రాజెక్టులకూ పెడుతుంటారు. గతంలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ హయాంలో ప్రతి కార్యక్రమానికి ఇందిర, రాజీవ్ పేర్లు పెట్టారు.


ఆ తర్వాత కాలంలో తెలుగు దేశం కూడా అదే బాట పట్టింది.. మొదట్లో ఎన్టీఆర్ పేర్లు పెట్టినా.. ఆ తర్వాత చంద్రబాబు పేర్లు కూడా కొన్ని పథకాలకు పెట్టేశారు. ఆ తర్వాత వచ్చిన జగన్ కూడా తానూ ఏమీ తక్కువ తినలేదన్నట్టు అనేక పథకాలకు వైఎస్సార్ పేరు.. తన పేరు పెట్టుకుంటున్నారు. అయితే వీటికి భిన్నంగా ఆయన కర్నూలు ఎయిర్ పోర్టుకు కర్నూలు ప్రాంతానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడి పేరు పెట్టారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కేవలం కర్నూలుకు చెందిన అమర వీరుడే కాకపోయినా.. ఆ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఆ పేరు పెట్టడాన్ని అనేక మంది స్వాగతించారు.

జగన్ కర్నూలు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ పేరు పెట్టారని తెలియగానే మెగాస్టార్ చిరంజీవి దాన్ని స్వాగతించారు. ఆయన పాత్ర పోషించనందుకు గర్వంగా ఉందని ప్రకటించారు. ఇలా మెగాస్టార్ ప్రకటన చేసిన తర్వాత కూడా జనసేన ఈ పేరును తప్పుబడుతూ రాజకీయం చేయడం విశేషం. కర్నూలుకే చెందిన దామోదరం సంజీవయ్య పేరు ఎయిర్‌పోర్టుకు పెట్టలేదని గుర్తు చేస్తూ.. ఆయన రెడ్డి కాకపోవడం వల్లే పెట్టలేదా అన్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ప్రారంభించారు.


అంటే ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని కూడా రెడ్డి కేటగిరీలోనే చూశారు తప్పితే స్వాతంత్ర్య సమరయోధుడిగా చూడలేదా అన్న వాదన వినిపిస్తోంది. అసలు కర్నూలు ఎయిర్‌పోర్టుకు జగన్ ఏ వైఎస్సార్‌ పేరో పెడితే తప్పుబట్టినా ఓ అర్థం ఉండేది కానీ.. అవేమీ కాకుండా ఓ స్వాతంత్ర్య సమరవీరుడి పేరు పెట్టినా తప్పుబట్టడం అవివేకం అనిపించుకుంటుంది. దీనికి తోడు చిరంజీవి పోస్టు పెట్టిన తర్వాత ఈ పోస్టు పెట్టడం ఆయన్ను మించిపోయామని చెప్పడమే అంటున్నారు మరికొందరు.

మరింత సమాచారం తెలుసుకోండి: