హుజూరాబాద్ నియోజక వర్గంలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఐదు మండలాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాల ముందు బారులు తీరారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కందుగుల పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ కమలాపూర్ లోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. 2018లో 84.5శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈ సారి 90శాతం దాటుతుందని అంచనా వేస్తున్నారు.

ఈ ఉదయం 9గంటల వరకు 10.50శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. అయితే ఇఫ్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగలేదని సీపీ సత్యనారాయణ తెలిపారు. ఆయన అలా ప్రకటించారో లేదో.. హుజూరాబాద్ నియోజక వర్గం వీణవంక మండలంలో ఘర్షణ చోటు చేసుకుంది. కోర్కల్ గ్రామంలోని స్థానిక కేంద్రంలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పారామిలటరీ బలగాలు రెండు వర్గాల వారిని చెదరగొట్టారు. పరిస్థిని అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం పోలింగ్ సజావుగా జరుగుతోంది.

అంతేకాదు వీణవంక మండలం గనుముక్కులలో పోలింగ్ కేంద్రానికి వచ్చిన టీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డిని బీజేపీ శ్రేణులు అడ్డుకున్నారు. స్థానికేతరులు ఎందుకు వచ్చారని నిలదీశారు. టీఆర్ఎస్ కు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారని కౌశిక్ రెడ్డితో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. ఇరువర్గాలను పోలీసులు చెదరగొట్టారు.

ఇక బద్వేల్ విషయానికొస్తే ఉదయం నుంచి పోలింగ్ నెమ్మదిగా సాగుతోంది. ఇప్పడిప్పుడే పుంజుకుంటోంది. 9గంటల వరకు 10.49శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు ప్రకటించారు. అయితే మధ్యాహ్నానికి పోలింగ్ మరింత పుంజుకుంటుందని అధికారులుచెబుతున్నారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న ఉపఎన్నికలు నేతల్లోనే కాదు ప్రజల్లోనూ ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. తాము ఓటు వేసే అభ్యర్థి గెలవాలంటూ కోరుకుంటున్నారు. ఆశగా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ అభిమాన నేతకు ఓటు వేస్తున్నారు. తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: