కరోనా సమయంలో వైద్యులే దేవుళ్లు, నర్సులే దేవతలు.. గుడి గోడల కన్నా.. ఆసుపత్రుల గోడలే ఎక్కువ ప్రార్థనలు వింటున్న రోజులు ఇవి. వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ చికిత్స అందిస్తున్నారు. కొందరు వైద్యులు చికిత్స అందిస్తూనే తాము కరోనా బారిన పడి మరణిస్తున్నారు. ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే.. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు మాత్రం ఇదే అదనుగా కరోనా రోగులు దోచుకుంటున్నాయి.

రోజుకో లక్ష రూపాయల చొప్పున వసూలు చేస్తూ రోగుల మరణ భయాన్ని క్యాష్ చేసుకుంటున్నాయి. ఇందుకు ఉదాహరణగా హైదరాబాద్ నాగోల్‌ లోని ఓ ఆస్పత్రి దోపిడీ ఉదంతం వెలుగు చూసింది. ఇక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రి కరోనా బాధితుడి వైద్య ఖర్చులకు వేసిన బిల్లు చూసి బాధితుడి గుండె గుభేల్‌మంది. నల్గొండ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కరోనాతో ఏప్రిల్‌ 15న ఈ ఆసుపత్రిలో చేరాడు. అతని పరిస్థితి సీరియస్ గా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు.

గత నెలలో ఈ ఆస్పత్రిలో చేరిన ఆ రోగిని గురువారం డిశ్ఛార్జి చేశారు. ఇంటికి పంపే ముందు బిల్లు కట్టాలి కదా.. అదే అడిగితే రూ. 24 లక్షల బిల్లు రోగి బంధువుల చేతికిచ్చారు. దాంతో కరోనాతో కోలుకున్న వ్యక్తికి గుండెపోటు వచ్చినంత పనైంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రోజుకు కొవిడ్‌ బాధితుడికి ఐసీయూకు రూ. 9,000, ఆక్సిజన్‌ బెడ్‌కు రూ.7000, సాధారణ వార్డుకు రూ.4000 చొప్పున మాత్రమే ఫీజు తీసుకోవాలి.

ఆ లెక్కలో చూస్తే నల్గొండ రోగికి 29 రోజుల చికిత్సకు 3 లక్షల వరకూ బిల్లు అవుతుంది. పోనీ ఇతర ఖర్చులు మరో 3 లక్షలు కలుపుకున్నా.. ఆరు లక్షలు అవుతుందేమో.. ఏకంగా 24 లక్షలు బిల్లు వేసే సరికి గుండె ఆగినంత పనైది. అంత బిల్లు కట్టలేమంటూ రోగి బంధువులు ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. మరి అధికారులు ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: