పాక్ ఆక్రమిత కశ్మీర్ అనేది ఎప్పటికీ ఎడి తెగని అంశమే. ఇది మాదంటే మాది అని అటు భారత్, అటు పాకిస్థాన్ లు ప్రకటిస్తూ ఉంటాయి. కాకపోతే ఎన్నికల సమయంలో దీని ప్రస్తావన కాస్తా ఎక్కువ ఉంటుంది. గతంలో  పాకిస్థాన్, భారత్ మ్యాచ్లో ఇండియా గెలిస్తే.. మ్యాచ్ కాదు.. ముల్తాన్లను గెలుచుకురావాలని బీజేపీ నాయకులు అనేవారు. తద్వారా జాతీయ వాదాన్ని తెరపైకి తెచ్చేవారు.


ఇప్పుడు కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ..  పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్ దేనని.. దాన్ని తిరిగి తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ఎన్నికల ముందు బాలాకోట్, సర్జికల్ స్రైక్ అనే అంశాలతో ఎన్నికలకు వెళ్లిన బీజేపీ భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఇప్పుడు కూడా మరోసారి ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేసి జాతీయవాదాన్ని తెరపైకి తెచ్చి రాజకీయ లబ్ధిని పొందాలని చూస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఒకవేళ పీవోకేని భారత్ లో విలీనం చేయాలని చూస్తే.. ఎన్డీయే కూటమి 2014 లో గెలిచింది. 2019లో అయితే భారీ మెజార్టీతో విజయం సాధించింది. కూటమి, ఇతర మిత్ర పక్షాలతో కలుపుకొంటే 400పైగా సీట్లు ఉన్నాయి. అయినా ఈ పదేళ్లలో పీవోకేను తిరిగి భారత్ లో విలీనం చేసేలా ఏ ఒక్క చర్యను నరేంద్ర మోదీ ప్రభుత్వం చేయలేకపోయింది.


ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి.. మరోసారి ఎన్డీయేని గెలిపిస్తే.. పీవోకేను భారత్ లో కలిపేస్తాం అని ప్రకటనలు ఇస్తున్నారు. ఒకవేళ నిజంగా కలుపుతారు అని అనుకున్నా.. ఎలా చేస్తారో ఆచరణ మాత్రం చెప్పడం లేదు. దీనికి రెండే అవకాశాలు ఉన్నాయి. ఒకటి సైనిక చర్య. భారత్ వెలుపల పాకిస్థాన్ భూ భాగంలో సైనిక చర్యలు ఉండొద్దని అటల్ బిహార్ వాచ్ పేయూ హయాంలో ఒప్పందం చేసుకున్నారు.  రెండోది చర్చల ద్వారా పరిష్కారం.  వాస్తవానికి మన దేశంలో ఉన్న కశ్మీర్ నే మాది అని పాకిస్థాన్ అంటుంటే.. ఇక పీవోకేను మనకి అప్పజెప్తారా? కాబట్టి ఈ రెండు సాధ్యం కాదు. మరెలా విలీనం చేసుకుంటారు. దీనిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: