కేశినేని బ్రదర్స్ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. ఇరువురి మధ్య ఆరోపణల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటోంది. విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తన సోదరుడు, టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నిపై వరుసగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న విశాఖలో ఉర్సా అనే ఐటీ సంస్థకు భూముల కేటాయింపు వెనుక చిన్ని ఉన్నారని ఆరోపించిన కేసినేని నాని.. తాజాగా ఏపీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన కీలక సూత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఆయన సన్నిహితుడు దిలీప్ పైలాలతో చిన్నికి సంబంధాలు ఉన్నాయ‌ని ఆరోప‌ణ‌లు చేస్తూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు లేఖ రాశారు.


హైద‌రాబాద్ లో ఉన్న‌ ` ప్రైడ్ ఇన్‌ఫ్రాకాన్ ఎల్ఎల్‌పీ ` అనే సంస్థలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎంపీ కేశినేని చిన్ని, ఆయన భార్య జానకీ లక్ష్మీ భాగస్వాములుగా ఉన్నారని.. అలాగే కసిరెడ్డి, దిలీప్ పైలా నిర్వహిస్తున్న ` ఇషాన్వి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ` కూడా ఇదే చిరునామాతో కార్యకలాపాలు సాగిస్తోందని నాని ఆరోపించారు. ఈ రెండు సంస్థలు ఒకే అధికారిక ఈ-మెయిల్ ఐడీని వినియోగిస్తున్నాయని లేఖ‌లో పేర్కొన్నారు. లిక్క‌ర్ స్కామ్ తో సంబంధం ఉన్న నిధులను పెద్ద మొత్తంలో కేశినేని చిన్ని అక్రమంగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్, విదేశీ కంపెనీలలో పెట్టుబడులుగా మళ్లించిన‌ట్లు త‌న ద‌గ్గ‌ర ఆధారాలు ఉన్నాయని.. మ‌ద్యం కుంభ‌కోణం కేసులో అరెస్ట్ అయిన ఇద్ద‌రు కీల‌క వ్య‌క్తుల‌తో సిట్టింగ్ ఎంపీకి ప్రత్యక్ష సంబంధాలుండటం తీవ్ర ఆందోళన క‌లిగిస్తుంద‌ని కేశినేని నాని ఆరోపించారు.


అయితే తాజాగా నాని వ్యాఖ్య‌ల‌ను ఎంపీ కేశినేని చిన్ని తీవ్రంగా ఖండించారు. నాని నీతిమాలిన ఆరోపణలకు స్పందించాల్సిన అవసరం లేనప్పటికీ.. ప్రజాప్రతినిధిగా ప్రజలకు, పార్టీ క్యాడర్ కు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత త‌న‌పై ఉంద‌ని చిన్ని అన్నారు. టీడీపీలో ఉంటూ నవవంచకుడు, నమ్మకద్రోహి జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాసిన వ్య‌క్తివి నువ్వు అంటూ నానిపై చిన్నిపై చిందులు తొక్కారు. క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి రాక‌ముందు త‌న సంస్థకు చెందిన ఆస్తి సరిహద్దులో రాజ్ క‌సిరెడ్డి సంస్థ‌కు చెందిప స్థ‌లం ఉండ‌టం కార‌ణంగా సంయుక్తంగా నిర్మాణం చేపట్టడానికి 2021లో ఆ సంస్థ‌ను రిజిస్ట‌ర్ చేయించామ‌ని.. అందుకు సంబంధించిన వివరాలు పబ్లిక్ డొమైన్లో ఉన్నాయ‌ని చిన్ని తెలిపారు.


క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని నిర్ణయించుకున్న తర్వాత రాజ్‌ కసిరెడ్డి సంస్థతో తెగ‌దెంపులు చేసుకున్నామ‌ని.. భారీ న‌ష్టం వ‌చ్చిన‌ప్ప‌టికీ సంయుక్తంగా ఎటువంటి నిర్మాణాలు జరుపుకుండా ఆనాడే నిర్ణయం తీసుకున్నామ‌ని చిన్ని స్ప‌ష్టం చేశారు. విదేశాల్లో పెట్టుబ‌డులు అంటూ నాని చేసిన ప‌స‌లేని ఆరోప‌ణ‌లు పూర్తిగా అవాస్త‌మ‌ని.. ద‌మ్ముంటే వాటిని నిరూపించాలంటూ ఎంపీ చిన్ని స‌వాల్ విసిరారు.


ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: