
ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత సోమవారం మీడియాలో మాట్లాడుతూ హరీష్ రావు, సంతోష్ రావుల అవినీతి అనుకొండలు అంటూ ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు అటు బిఆర్ఎస్ పార్టీలో తీవ్ర కలకలాన్ని సృష్టించాయి. దీంతో కేటీఆర్ తో పాటుగా పలువురు ఎమ్మెల్యేలు ,సీనియర్ నేతలు కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఒక మీటింగ్ ని ఏర్పాటు చేసుకొని అక్కడ కవిత తీరుతో పార్టీకి జరిగే నష్టాన్ని సైతం కేసీఆర్ కు వివరించారట. దీంతో ఆమెతో పార్టీకి ఏదైనా లాభం ఉందా? అంటూ కేసిఆర్ అడగగా.. లాభం సంగతి అలా ఉంచితే పార్టీకి తీవ్ర నష్టం కలిగించేలా చేస్తొంది అంటూ ఆమె చేస్తున్న పనులు విపక్షాలకు ఆయుధం అవుతున్నాయని కేసీఆర్ కి నేతలు అందరూ వివరించారు. దీంతో పార్టీ నుంచి ఆమెను బయటికి పంపించాల్సిందే అంటూ నేతలు పట్టు పట్టారు.
అయినా కూడా కేసీఆర్ మాత్రం అప్పుడే నిర్ణయం తీసుకోకుండా మరుసటి రోజు కూడా ఫామ్ హౌస్ లో కీలకమైన నేతలతో భేటీ అయ్యారు. అందులో శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, సంజయ్ రావు, జగదీశ్వర్ రెడ్డి, రాజేశ్వర్ రెడ్డి వంటి వారితో కవిత అంశం పైన సుదీర్ఘంగా చర్చించారు. ఎమ్మెల్సీ కవిత పైన వేటు వేస్తే లాభనష్టాల పైన కూడా లెక్కేసుకున్నారు. కవిత పైన సరైన నిర్ణయం తీసుకొని పక్షంలో ఆమే పార్టీలో ఉంటే మాత్రం పార్టీకే నష్టం కలుగుతుందనే విషయాన్ని నేతలు కెసిఆర్ కు తెలిపారు. ఈ విషయాన్ని పరిగణంలోకి తీసుకున్న కేసీఆర్ కవిత పైన నిన్నటి రోజున మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో సస్పెన్షన్ ప్రకటించారు.
అయితే మొదట ఈమె పైన బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించుకున్నప్పటికీ అందుకు సంబంధించి ప్రకటనను కూడా సిద్ధం చేశారు. కానీ అధికారికంగా ప్రకటనలో మాత్రం సస్పెన్షన్గా మార్చారు.. బిఆర్ఎస్ పార్టీ నిబంధనల ప్రకారం పార్టీ నుంచి బహిష్కరిస్తే ఆరేళ్లపాటు మళ్ళీ తిరిగి పార్టీలో వచ్చే అవకాశం ఉండదట.. ఒకవేళ సస్పెన్షన్ చేస్తే ఏ క్షణమైనా సరే తిరిగి పార్టీలో తీసుకునే అవకాశం ఉంటుంది. నిన్నటి రోజు నుంచి మరో విషయం రాజకీయాలలో వినిపిస్తోంది ఏమిటంటే.. ఎమ్మెల్సీ పదవికి కూడా కవిత రాజీనామా చేసినట్లుగా జాగృతి వర్గాలు తెలియజేశాయి. పార్టీ నుంచి బహిష్కరించలేదు కాబట్టి.. సస్పెన్షన్ ఎత్తివేస్తే కవిత తిరిగి మళ్లీ బిఆర్ఎస్ పార్టీలో కొనసాగవచ్చు. మరి కవిత ఈ విషయంపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.