
‘తల్లికి వందనం’ పథకానికి సంవత్సరానికి 12 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందని అంచనా. అంతేకాదు, రైతులకు ఊరట కలిగించే ‘అన్నదాత సుఖీభవ’ పథకం వల్ల ఏటా 18 నుంచి 22 వేల కోట్ల వరకు అదనపు భారమని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జీఎస్టీ శ్లాబులను తగ్గించడం వల్ల రాష్ట్ర ఆదాయం సహజంగానే తగ్గిపోతుంది. జీఎస్టీ రూపంలో రాష్ట్రానికి వచ్చే రెండు రకాల ఆదాయాలు ఉంటాయి. ఒకటి నేరుగా రాష్ట్రం సేకరించే పన్ను ఆదాయం, మరొకటి కేంద్రం నుంచి రాష్ట్రానికి లభించే జీఎస్టీ వాటా. శ్లాబులు తగ్గిపోవడం వల్ల రెండు రకాలుగాను ఆదాయం తగ్గిపోవడం ఖాయం. దీనివల్ల పథకాల అమలు కష్టమవుతుందని, భవిష్యత్తులో రాష్ట్ర ప్రణాళికా వ్యయాలపై కోతలు విధించే పరిస్థితి రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం కొత్త వ్యూహాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టిపైన దృష్టి పెట్టి, పరిశ్రమలకు మరింత అనుకూల వాతావరణం కల్పించడం, పెట్టుబడులను ఆకర్షించడం, పన్ను ఎగవేతలను అరికట్టడం వంటి చర్యలు తీసుకోవాలి. అదనంగా, వినియోగ పన్నులు, స్టాంప్ డ్యూటీ, ఎక్సైజ్ వంటి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి సారించాలి. ఫైనల్‌గా మొత్తం మీద, జీఎస్టీ తగ్గింపుతో రాష్ట్రానికి తక్షణ ఆర్థిక సవాళ్లు ఎదురవుతాయి. ఇప్పటికే అమలు జరుగుతున్న భారీ సంక్షేమ పథకాల వ్యయం దృష్ట్యా, ప్రభుత్వం తన ఆర్థిక వ్యూహాలను మళ్లీ సవరించుకోవాల్సిన అవసరం తప్పనిసరిగా కనిపిస్తోంది.