ఏపీలో జనసేన పార్టీ ఇప్పుడు కేవలం మూడవ ఆల్టర్నేటివ్‌గా కాకుండా, రాజకీయంగా ఒక బలమైన శక్తిగా రూపుదిద్దుకుంటోంది. తెలుగుదేశం, వైసీపీ వంటి రెండు ప్రధాన పార్టీల మధ్య జరుగుతున్న అధికార పోరులో… జనసేన వ్యూహాత్మకంగా టీడీపీకి మద్దతుగా నిలిచి కూటమిలో చేరింది. కానీ ఈ నిర్ణయం సరైనదా కాదా అన్నది ఒక పెద్ద సామాజిక వర్గంలో చర్చగా మారింది. ఎందుకంటే - అధికారాన్ని ఎప్పటికప్పుడు టీడీపీ, వైసీపీ మాత్రమే పంచుకుంటుండగా, జనసేన మాత్రం పక్క వాయిద్యంగా మిగిలిపోతోందని భావిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రారంభం నుంచే “ఏపీ ఫస్ట్” అనే స్టాండ్‌పై నిలిచారు. పదవుల కంటే రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని ఆయన అనేక వేదికల్లో స్పష్టం చేశారు. చంద్రబాబు నాయకత్వంలో ఏపీ మరో 15 ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వంగా కొనసాగితే దేశంలోనే అగ్రగామిగా నిలుస్తుందని ఆయన నమ్మకం. అందుకే వ్యక్తిగత పదవుల కంటే రాష్ట్ర భవిష్యత్తును ప్రాధాన్యంగా చూస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.


అయితే రాజకీయాలు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి. ఒకే విధమైన నిర్ణయాలపై నిలబడడం రాజకీయాల్లో కుదరదు. సీఎం పవన్ కళ్యాణ్ అని నినదించిన జనసేన కార్యకర్తల్లో ఇప్పుడు కొంత నిరాశ నెలకొంది. అధిక జనాభా కలిగిన ఒక సామాజిక వర్గం వారు “మా వంతు ఎప్పుడు?” అనే ప్రశ్నను బహిరంగంగానే వేస్తున్నారు. కూటమి సహచరులతో జరిగిన ఇటీవల పరిణామాలు - ముఖ్యంగా అసెంబ్లీలో బాలయ్య ఎపిసోడ్ తర్వాత— జనసేన నేతల్లో కూడా అంతర్మథనం మొదలైందని సమాచారం. ఇప్పటి వరకు కూటమిలో వెనక సీటు తీసుకున్న జనసేన, ఇక బలమైన శక్తిగా మారాలన్న ఆలోచనలో ఉంది. తాము బలంగా ఉంటేనే మిత్రపక్షాల వద్ద గౌరవం దక్కుతుందని, వాటా కూడా పెరుగుతుందని పార్టీ బలంగా నమ్ముతోంది. అందుకే రానున్న మూడు సంవత్సరాల్లో పార్టీని పునర్వ్యవస్థీకరించి స్వతంత్రంగా నిలబడే దిశగా కసరత్తులు ప్రారంభమయ్యాయి.



టార్గెట్ 2029 - పెద్ద లక్ష్యం : 2029 ఎన్నికల్లో జనసేన కేవలం పక్కవాయిద్యంగా కాకుండా, అధికారంలో కీలక పాత్ర పోషించాలనే ప్లాన్‌తో ముందుకు వెళ్తోంది. వచ్చే ఎన్నికల్లో సీట్లతో పాటు అధికారంలో గట్టి వాటా కోసం పట్టుబట్టే స్థాయిలో పార్టీ ఎదగాలన్నదే టార్గెట్. జనసేన దూకుడు ఈ దిశగా సాగుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.మొత్తానికి… ఏపీ రాజకీయాల్లో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు జనసేనకు ఒక పెద్ద మలుపుగా మారాయి. ఇక జనసేన తేలిక కాదు… బలమైన శక్తిగా మారే దిశలో పావులు కదుపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: