ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మళ్లీ వేడెక్కబోతున్నాయి. ఈ నెల 16వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాయలసీమ పర్యటనకు వస్తుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో భారీ హీట్ క్రియేట్ అయింది. ముఖ్యంగా కూటమి పార్టీ నేతలు ఈ పర్యటనను జగన్‌పై సూటి దాడి చేసేందుకు బంగారు అవకాశంగా మలచాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకూ ఎన్నిసార్లు ఏపీ పర్యటనకు వచ్చినా మోదీ జగన్‌పై నేరుగా విమర్శలు చేయలేదు. అయితే ఈసారి మాత్రం కథ మారబోతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.


రాయలసీమ టూర్ – ఫోకస్ జగన్‌పై?:
ప్రధాని మోదీ ముందుగా శ్రీశైలానికి చేరుకుని భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లను దర్శించుకోనున్నారు. ఆ తరువాత కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరులో జరిగే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ సభలో ప్రధానంగా జీఎస్టీ 2.0 సంస్కరణలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే కేంద్ర ఉద్దేశ్యం. అయితే ఆ బహిరంగ సభలోనే జగన్ ప్రభుత్వం చేపట్టిన విధానాలను మోదీ ఎండగట్టే అవకాశముందని కూటమి పార్టీ నేతలు భావిస్తున్నారు. జగన్ పాలనలో జరిగిన అవకతవకలు, అవ్యవస్థలపై ప్రధాని నేరుగా స్పందిస్తే… కూటమి పార్టీలకు అదో భారీ బూస్ట్ అవుతుందని వారు భావిస్తున్నారు.



ఇప్పటి వరకూ మోదీ మౌనం – ఈసారి దెబ్బ?:
మోదీ గతంలో కూడా పలుమార్లు ఆంధ్రప్రదేశ్ పర్యటించారు. అమరావతి రాజధాని నిర్మాణం పునరుద్ధరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. విశాఖపట్నంలో జరిగిన యోగా డే వేడుకల్లో కూడా హాజరయ్యారు. అయితే ఆ రెండు సందర్భాల్లోనూ జగన్ ప్రభుత్వంపై ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం కూటమి క్యాడర్‌లో అసంతృప్తిని కలిగించింది. ఈసారి కర్నూలులో మాత్రం మోదీ జగన్‌పై తీవ్ర విమర్శలు చేయడం ఖాయమని, పై స్థాయిలో ఇప్పటికే ప్రణాళిక సిద్ధమైందని సమాచారం.



“జగన్‌పై దాడి తప్పదు” – కూటమి నేతల నమ్మకం:
జగన్ ఇటీవల రాజకీయంగా స్పీడ్ పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ వేదికపై ఆయనపై నిప్పులు చెరిగేలా కూటమి నేతలు హస్తిన స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రాయలసీమలో జగన్ పాలనను మోదీ టార్గెట్ చేస్తే కూటమికి ఆక్సిజన్ లభిస్తుందని వాళ్ల నమ్మకం. ముఖ్యంగా రైతులు, యువత, ఉద్యోగులు, విద్యుత్ సంక్షోభం, పెట్టుబడిదారుల వెనకడుగు వంటి అంశాలపై ప్రధానమంత్రి దాడి చేయవచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది.



రాజకీయంగా హై వోల్టేజ్ సీన్!:
కర్నూలు సభలో మోదీ ప్రసంగం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త సీన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది. మోదీ నేరుగా జగన్‌పై దాడి చేస్తే… కూటమి మిత్రధర్మం స్పష్టమవుతుందని, కేంద్రం వైఎస్ జగన్ పట్ల ఉన్న సాఫ్ట్ కార్నర్ భావన తొలగిపోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. మరి 16న కర్నూలు సభలో మోదీ మాటల్లో జగన్ పేరు వినిపిస్తుందా? కూటమి నేతల ఊహలు నిజమవుతాయా? అన్నది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: