త‌మ రాజ‌కీయ జైత్ర‌యాత్ర‌లో భాగంగా ద‌క్షిణాది రాష్ట్రాల‌నూ ఒక్కొక్క‌టిగా సొంతం చేసుకోవాల‌ని భావించిన బీజేపీకి ఆ ఆశ‌లు అనుకున్నంత సులువుగా నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు దేశ రాజ‌కీయ య‌వ‌నిక‌పై రానున్న మార్పుల‌కు సంకేతాలుగానే భావించాల్సి ఉంటుంది. త‌మిళనాట జ‌య‌ల‌లిత మ‌ర‌ణం తరువాత అన్నాడీఎంకే ప్ర‌భుత్వాన్ని త‌మ గుప్పిట్లో పెట్టుకుని మోదీషాలు త‌మ‌ రాజ‌కీయ వ్యూహాలను అమ‌లు చేశారు. అయితే త‌మిళ తంబీలు ద్ర‌విడ పార్టీల‌నే త‌ప్ప‌ ఉత్త‌రాది పార్టీల ఆధిప‌త్యాన్ని ఎన్న‌టికీ అంగీక‌రించ‌ర‌ని తాజాగా డీఎంకే గెలుపు వారికి తెలియ‌జెప్పింది. ఇక దేశంలోనే అత్య‌ధిక అక్ష‌రాస్య‌త క‌లిగిన కేర‌ళ‌లో బీజేపీ అనుస‌రించిన మ‌త త‌త్వ‌ రాజ‌కీయాలను అక్క‌డి ప్ర‌జ‌లు స్ప‌ష్టంగా తిప్పికొట్టారు. తెలంగాణ‌లో కాస్తో కూస్తో ప్ర‌భావం చూప‌గ‌లుగుతున్నా.. మాట‌ల గాంభీర్య‌మే త‌ప్ప అక్క‌డ అధికారంలోకి వ‌చ్చేంత సీన్ స‌మీప భ‌విష్య‌త్తులో క‌నిపించ‌డం లేదు. అందులోనూ స‌మ‌యానుకూలంగా రాజ‌కీయ ఎత్తులు వేయ‌డంలో అఖండుడైన కేసీఆర్ ముందు బీజేపీ ప‌ప్పులు ఉడ‌క‌వు. క‌ర్ణాట‌క‌లో కుమార‌స్వామి ప్ర‌భుత్వాన్ని ముప్పుతిప్ప‌లు పెట్టి, కుట్ర‌ల‌తో కూల్చి త‌మ పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ఇటీవ‌ల అక్క‌డి స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న తీరు చూశాక ఆ రాష్ట్ర బీజేపీ నేత‌ల‌కు నిద్ర ప‌ట్ట‌ని ప‌రిస్థితి ఉంది. ఇక ఏపీ విష‌యానికొస్తే ఇటీవ‌లి తిరుప‌తి ఉప ఎన్నికలో జ‌న‌సేన మ‌ద్ద‌తుతో బీజేపీ సాధించిన ఓట్లకు, నాయ‌కుల చేసిన హ‌డావిడికి ఎక్క‌డా పొంత‌న లేదు.

నిజానికి 2024లో సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌నాటికి ఉత్త‌రాది రాష్ట్రాల్లో త‌మ బ‌లం కొంత త‌గ్గినా ద‌క్షిణాది రాష్ట్రాల్లో వీలైనంత బ‌ల‌ప‌డి ఆ లోటు పూడ్చుకోవాల‌న్న‌ది ఇప్ప‌టిదాకా బీజేపీ అధిష్ఠానం వ్యూహంగా ఉంది. అటు తూర్పున బెంగాల్‌నూ గుప్పిట ప‌ట్టాల‌నుకుంది. కానీ అక్క‌డ బెంగాల్ టైగ‌ర్ మ‌మ‌తా బెన‌ర్జీ బీజేపీ జోరుకు అడ్డుక‌ట్ట వేసిన విష‌యం తెలిసిందే. అందుకే దీదీ ప్ర‌భుత్వంపై బీజేపీ క‌క్ష గ‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇదే స‌మ‌యంలో ఉత్త‌ర ప్ర‌దేశ్ స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాలు బీజేపీ అగ్ర‌నాయ‌కుల భ‌యాల‌ను నిజం చేశాయి. అవి బీజేపీకి పూర్తి వ్య‌తిరేకంగా ఉన్నాయి. అంతేకాదు.. మోదీ మ్యాజిక్ ప్ర‌జ‌ల‌పై ఇక ప‌ని చేయ‌ద‌ని కూడా ఇవి చాటి చెప్పాయి. కొన్ని నెల‌లుగా ఢిల్లీ స‌రిహ‌ద్దుల‌ను ముట్ట‌డించి రైతులు చేస్తున్న ఉద్య‌మంపై బీజేపీ ప్ర‌భుత్వం అనుస‌రిస్తున్న నిర్ల‌క్ష్య‌ వైఖ‌రి, వ‌ల‌స కూలీల వెత‌లు, కోవిడ్ నియంత్ర‌ణ‌లో వైఫ‌ల్యం దేశ‌వ్యాప్తంగా రైతుల‌తోపాటు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్లోనూ మోదీ ప్ర‌తిష్ఠ‌ను మ‌స‌క‌బార్చాయి. అంతేకాదు ఆర్ఎస్ఎస్ వ‌ర్గాల్లో కూడా మోదీ విధానాల‌పై వ్య‌తిరేక‌త నెల‌కొంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో రానున్న రోజుల్లో దేశ‌రాజ‌కీయాల్లో త‌న ప‌ట్టు నిలుపుకోవ‌డానికి బీజేపీ ఎలాంటి వ్యూహాల‌ను అనుస‌రించ‌నున్న‌ద‌నే విష‌యంపై రాజ‌కీయ విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. ఇప్పటిదాకా అజేయుల‌మ‌ని భావించిన మోదీషా ద్వ‌యం అటు ప్ర‌భుత్వం లోనూ ఇటు పార్టీలోనూ అంతా తామే అన్నట్టుగా వ్య‌వ‌హ‌రించారు. ఇప్పుడు వారికి ఎదురుగాలులు వీస్తుండ‌టంతో ఇక‌పై వారి వైఖ‌రి మార్చుకోక త‌ప్ప‌ద‌ని ఆ పార్టీలోనే అంత‌ర్గతంగా చ‌ర్చ న‌డుస్తోంది.. ఇప్ప‌టిదాకా పొత్తులు పెట్టుకున్న పార్టీల‌నే క‌బ‌ళించే  స‌రికొత్త వ్యూహాన్నిఅనుస‌రిస్తూ వ‌చ్చిన బీజేపీ మ‌ళ్లీ ఆ ప్రాంతీయ పార్టీల‌తో సామ‌ర‌స్య వైఖ‌రి కోసం దిగిరాక త‌ప్ప‌క‌పోవ‌చ్చు. అయితే మోదీ తత్వం తెలిసిన‌వారికి ఇది ఎంత‌వ‌ర‌కు సాధ్య‌మ‌నే అనుమానాలు రావ‌డం స‌హ‌జ‌మే. అంతేకాదు.. మోదీషా ఆధ్వ‌ర్యంలోని బీజేపీని ఇత‌ర పార్టీలు ఎంత‌వ‌ర‌కు విశ్వ‌సిస్తాయ‌నే సందేహాలూ వ్య‌క్త‌మ‌వుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: