దేశానికి స్వాతంత్య్రం తెచ్చామ‌ని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ప్ర‌స్తుత దుస్థితికి కార‌ణం ఏమిటి..? రాజ‌కీయ పార్టీల‌కు గెలుపోట‌ములు స‌హ‌జ‌మే. కానీ దేశాన్ని సుదీర్ఘ‌కాలం అప్ర‌తిహ‌తంగా పాలించిన పార్టీ, కొన్నిరాష్ట్రాల్లో అధికారంలోనూ, ప‌లు రాష్ట్రాల్లో ఇప్ప‌టికీ చెప్పుకోద‌గ్గ బ‌లాన్ని క‌లిగి ఉన్న పార్టీ కేంద్రంలో బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా ఎందుకు ఆవిర్భ‌వించ‌లేక‌పోతోంది. ప్ర‌జ‌ల‌కు ఎందుకు న‌మ్మ‌కం క‌లిగించ‌లేక‌పోతోంది..? దీనికి క‌ర్ణుడి చావుకు ఉన్న‌న్ని కార‌ణాలు ఉన్నాయ‌ని చెప్పుకోవాలి. నిజానికి ఈ ప‌రిస్థితికి బీజాలు చాలాకాలం క్రిత‌మే ప‌డ్డాయి. ఖ‌చ్చితంగా చెప్పాలంటే రాజీవ్ గాంధీ హ‌యాం నుంచే పార్టీ ప‌త‌నం మొద‌లైంది. ఇది నిష్టుర స‌త్యం. ఇందిరాగాంధీ దారుణ హత్య‌తో అనివార్యంగా ఎదురైన ప‌రిస్థితుల నేప‌థ్యంలో రాజ‌కీయాల్లోకొచ్చేనాటికి రాజీవ్‌గాంధీకి మిస్ట‌ర్ క్లీన్ అనిపేరు. ఇందిర హ‌త్య సానుభూతి ఓట్ల రూపంలోకి ప్ర‌వ‌హించ‌డంతో 1984 ఎన్నిక‌ల్లో దేశ‌వ్యాప్తంగా ఏకంగా 49.10 శాతం ఓట్ల‌తో 404 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఘ‌న‌విజ‌యం సాధించ‌డం ద్వారా రాజీవ్‌గాంధీ ప్ర‌ధాని పీఠాన్ని అధిష్ఠించారు. ఈ అసాధార‌ణ విజ‌య‌మే రాజీవ్ క్షేత్ర‌స్థాయి అంశాల‌పై నిర్ల‌క్ష్యం వ‌హించేందుకు కార‌ణ‌మైంది.

         అప్ప‌టివ‌ర‌కు ఇందిర అంటే ఇండియా.. ఇండియా అంటే ఇందిర అనే ప‌రిస్థితి దేశ రాజ‌కీయాల్లో కొన‌సాగింది. ఆ స్థాయి రాజ‌కీయ అనుభ‌వం, చాణ‌క్యం రాజీవ్‌కు లేవు. ఉన్న‌ద‌ల్లా సాంకేతికంగా దేశాన్ని ముందుకు తీసుకువెళ్లాల‌న్న సంక‌ల్ప‌మే. ఆయ‌న‌కు రాజ‌కీయ అనుభ‌వం లేక‌పోయినా..ఢక్కామొక్కీలు తిన్న సీనియ‌ర్ నాయ‌కులు చాలామందే అప్పుడు పార్టీలో ఉన్నారు. వారిలో ఇందిరాగాంధీ ముందు మాట్లాడ‌టానికి సాహ‌సించ‌లేని నాయ‌కులు రాజీవ్ కోట‌రీగా ఏర్ప‌డ్డారు. వారిపైనే రాజీవ్‌గాంధీకి ప్ర‌ధానంగా ఆధార‌ప‌డాల్సి వ‌చ్చింది. కాంగ్రెస్ పేద‌ల పార్టీ అన్న ముద్ర నుంచి కార్పొరేట్ అనుకూల పార్టీగా మారుతుంద‌న్న అనుమానాలు ప్ర‌జ‌ల్లో మొల‌కెత్తిందీ ఆ కాలంలోనే. నిజాయితీ ప‌రుడిగా ముక్కుసూటిత‌నంతో వ్య‌వ‌హ‌రించే నేత‌గా పేరున్న విశ్వ‌నాథ్ ప్ర‌తాప్‌సింగ్ ప‌న్ను ఎగ్గొట్టే సంప‌న్నుల‌పై క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాల‌ని తీసుకున్న నిర్ణ‌యాల కార‌ణంగా ఆయ‌న‌ను ఆర్థిక శాఖ నుంచి ర‌క్ష‌ణ శాఖ‌కు మార్చారు రాజీవ్‌గాంధీ. బోఫోర్స్ కుంభ‌కోణం ఆ కాలంలోనే వెలుగు చూసింది. దీంతో ప్ర‌భుత్వంలో అవినీతిని అడ్డుకున్నందుకే వీపీ సింగ్‌ను మంత్రి ప‌ద‌వినుంచి త‌ప్పించార‌న్న అప‌ప్ర‌థ వ‌చ్చింది.

 
        ఈ కాలంలోనే కొంద‌రు యూపీ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్‌ నాయ‌కులు అప్పుడ‌ప్పుడే విస్త‌రిస్తున్న‌ బీజేపీ ప్ర‌భావాన్ని అడ్డుకునేందుకు అయోధ్యలో శిలాన్యాస్‌కు అనుమ‌తించాల‌ని ప్ర‌ధాని రాజీవ్‌పై ఒత్తిడి తెచ్చారు. ఇది కేవ‌లం హిందువుల‌కు తాము వ్య‌తిరేకం కాద‌నే చెప్పుకోవ‌డానికే. అయితే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ముస్లిం వ‌ర్గాల్లో కాంగ్రెస్ పార్టీపై అప‌న‌మ్మ‌కాన్ని క‌లిగించిన అంశ‌మిది. రాజీవ్‌గాంధీ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలోనే శ్రీలంకలో ఎల్‌టీటీఈని నియంత్రించేందుకు భారత సైనికులు రంగంలోకి దిగారు. ఆ నిర్ణ‌యం త‌మిళుల్లో కాంగ్రెస్ పార్టీప‌ట్ల వ్య‌తిరేక‌త పెరిగేందుకు కార‌ణ‌మైంది. ఆ స‌మ‌యంలోనే కాంగ్రెస్ పార్టీని వ‌దిలి బ‌య‌ట‌కు వెళ్లిన వీపీసింగ్ జ‌న‌తాద‌ళ్ పార్టీని స్థాపించ‌డంతో పాటుగా దేశ‌వ్యాప్తంగా కాంగ్రెసేత‌ర పార్టీల‌తో క‌లిసి నేష‌న‌ల్ ఫ్రంట్‌గా ఏర్ప‌డి కేంద్రంలో తాను ప్ర‌ధానిగా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌గ‌లిగారు. ఆ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఆధ్వ‌ర్యంలోని జ‌న‌తాద‌ళ్ పార్టీ ఏకంగా 18 శాతం ఓట్ల‌తో 141 స్థానాల్లో విజ‌య దుందుభి మోగించింది. బీజేపీ అంత‌కుముందున్న 2 సీట్ల‌నుంచి 85 సీట్ల‌కు ఎగ‌సింది.  
           

       కాగా కాంగ్రెస్ పార్టీ 10 శాతం ఓట్లు కోల్పోయి 197 సీట్ల‌కు ప‌రిమిత‌మైంది. 1984 ఎన్నిక‌ల్లో సాధించిన ఘ‌న‌విజ‌యం దృష్టిలో ఉంచుకుని చూస్తే 89 నాటి కాంగ్రెస్ ప‌రాజ‌యానికి కార‌ణం రాజీవ్‌గాంధీ అనుభ‌వ‌రాహిత్య‌మేన‌న్న‌ది స్ప‌ష్టంగానే తెలుస్తుంది. ఆ త‌రువాత ప‌లు కార‌ణాల‌తో వీపీ సింగ్ ప్ర‌భుత్వం కూలిపోవ‌డం ఎన్నిక‌లు రావ‌డం, ఆ ఎన్నిక‌ల ప్ర‌చారం స‌మ‌యంలోనే రాజీవ్ గాంధీని ఎల్‌టీటీఈ తీవ్ర‌వాదులు పొట్ట‌న‌పెట్టుకోవ‌డం జ‌రిగిపోయాయి. రాజీవ్ హ‌త్య కార‌ణంగా కాంగ్రెస్‌పై మ‌రోసారి సానుభూతి ప‌వ‌నాలు వీయ‌డం కార‌ణంగానే ఆ పార్టీ 1991లో పీవీ న‌ర‌సింహారావు ప్ర‌ధానిగా ప్ర‌భుత్వం ఏర్పాటు చేయ‌గ‌లిగింది. ఆ త‌రువాత జ‌న‌తాద‌ళ్ ప్రాభ‌వం త‌గ్గ‌డంతో ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ములాయం సింగ్ యాద‌వ్ స‌మాజ్‌వాదీ పార్టీని ఏర్పాటు చేసి యాద‌వులు, ముస్లింల అండ‌తో ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప్ర‌బ‌ల శ‌క్తిగా ఆవిర్భ‌వించారు. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వైభ‌వాన్ని గ‌త చ‌రిత్ర‌గా మార్చేశారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి: