
అయితే కాంగ్రెస్ కు మద్దతుగా వైటీపీ, సీపీఐ, టీజేఎస్, పోటీ చేయని చోట్ల సీపీఎం మద్దతు ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. అంతర్గతంగా టీడీపీ సోషల్ మీడియా విభాగంతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించి ఆ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేశారు. మనం ఉదాహరణకు కొన్ని ఘటనలు చూసుకున్నా.. ఖమ్మం ప్రియాంకా గాంధీ రోడ్ షో లో కాంగ్రెస్ జెండాలతో సమానంగా టీడీపీ జెండాలు కనిపించాయి. ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక కూడా గాంధీ భవన్ దగ్గర పసుపు జెండాలు ప్రత్యక్షమయ్యాయి.
2018లో కూడా టీడీపీతో పొత్తు పెట్టుకున్నా.. ఆశించిన ఫలితం హస్తం పార్టీకి రాలేదు. మరోవైపు 2018లో టీడీపీ కాంగ్రెస్ పొత్తు కాబట్టి ఏపీలోని వైసీపీ మొత్తం కూడా బీఆర్ఎస్ కు అనుకూలంగా నిలబడ్డారు. సోషల్ మీడియా విభాగం కూడా బీఆర్ఎస్ కోసమే పనిచేసింది. ఈ దఫా వచ్చే సరికి వారంతా గులాబీ పార్టీకి షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఎందుకంటే గత ఐదారు నెలల నుంచి తమ గొప్పలు చెప్పుకునే క్రమంలో బీఆర్ఎస్ మంత్రులు ఏపీ ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపడం ప్రారంభించారు. ఆంధ్రాలో గోతులు, తెలంగాణలో డబుల్ రోడ్లు, చీకట్లో ఆంధ్రా.. వెలుగుల్లో తెలంగాణ వంటి అంశాలను పోలుస్తూ ప్రచారం సాగించారు. సీఎం కేసీఆర్ కూడా ఓ సభలో ఆంధ్రా పరిస్థితిపై సెటైర్లు వేశారు. ఇవి జగన్ కు కూడా ఆగ్రహాన్ని తెప్పించి ఉండొచ్చు. అందుకే బీఆర్ఎస్ కోసం పనిచేయమని వైసీపీ నాయకులకు చెప్పలేదని సమాచారం.