తెలుగు సినిమా పరిశ్రమలో విలక్షణ నటనతో గుర్తింపు తెచ్చుకున్న కోట శ్రీనివాసరావు , కేవలం హాస్య నటుడిగా మాత్రమే కాకుండా, సున్నిత భావాల వ్యక్తిగా, గంభీర దృక్పథం ఉన్నవాడిగా కూడా పరిశ్రమలో పేరు పొందారు. సినిమాలు విడుదలైన వెంటనే ఆ మూవీ టైటిల్‌తో కలిపి చమత్కారంగా కామెంట్లు చేయడం కోట స్పెషాలిటీ . అయితే ఇవి ఎప్పుడూ ఏవో అక్షరాల మాటలుగా కాక, తీక్షణమైన పరిశీలనతో కూడిన విమర్శాత్మక హాస్యంగా ఉండేది. ఉదాహరణకు , ఓ సినిమా ప్లాప్ అయితే - "ఆ సినిమా టైటిల్ 'విజయం' కానీ .. పక్కవారికే వచ్చింది !  అంటూ చమత్కారంగా చెప్పేవారు.


"కోట జడ్జిమెంట్" అనేది పరిశ్రమలో ఒక జ్ఞాపకం. ఏ సినిమా నచ్చినా, నచ్చకపోయినా - ఆయన స్పందన నిజాయితీ తో కూడిన విమర్శ.
ఈ నిక్కచ్చితనమే ఆయనని ఇతర నటుల కంటే ప్రత్యేకంగా నిలబెట్టింది . ఆయన ఒక భావకవి కూడా. ఎప్పుడైనా లోపలి భావోద్వేగం ఎక్కువైతే కవితలు గా వ్యక్తమయ్యేవి . అలాటి ఒక కవితలో – కుల , మత భేదాల పై అందరినీ ఆలోచింపజేసే విధంగా ఇలా రాశారు:



"నది అడగదు నావనీ
నీ కులమేనిటనీ?
కడలి అడగదు ఈ నదిని
నీ మతమేమిటని?"

"కులాలు, మతాలు
కంటిలోని నలుసులేరా!
తీసుకుంటే అంతా సొగసే రా!"

శ్రీశ్రీ ‘మహా ప్రస్థానం’ పఠించిన తర్వాత శ్రామికుల బాధపై స్పందిస్తూ మరో కవిత ఇలా రాశారు:

"గుడ్డు పెట్టేది గుడిసెలోని కోడి
ఆమ్లెట్లు మేసేది మేడ లోని కేడీ
ఏమిటీ అన్యాయమని అడిగితే
గుడిసెలోని కోడికి చావు
మెడలోని కేడీ కి పలావు!"

కోట గారి మాటలో... “కవిత్వం రాసి పత్రికలకోసం కాదు… మనసు బాధపడినపుడు అది బాషగా మారి బయటకు వస్తుంది.” తన నటనతో నవ్వించినప్పటికీ, తన మాటలతో ఆలోచింపజేసిన గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు. సినిమా స్క్రీన్ కి అతీతంగా - ఒక సామాజిక బాధ్యత గల వ్యక్తిగా ఆయనకు గుర్తింపు ఉంది. అయ‌న మ‌ర‌ణం భార‌త‌య చిత్ర ప‌రిశ్ర‌మ‌కు తిర‌ని లోటు

మరింత సమాచారం తెలుసుకోండి: