ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్న విషయం తెలిసిందే. అక్టోబర్ నెల 15వ తేదీ నుండి వైయస్సార్ రైతు భరోసా పథకం రాష్ట్రంలో అమలు కాబోతుంది. ఈ పథకానికి అర్హులైన రైతుల జాబితా సిద్ధం చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. అర్హుల జాబితా పూర్తయిన తరువాత గ్రామాల్లో అర్హుల జాబితాలను విడుదల చేస్తారు. 
 
వెబ్ ల్యాండ్ లో నమోదైన రైతులతో పాటు కౌలు రైతులు (ఓసీలు మినహా) ఈ పథకానికి ఆర్హులు అవుతారు. ఐదు ఎకరాలకు మించి పొలం ఉన్నవారికి రైతు భరోసా పథకం వర్తించదు. మాజీ ప్రజా ప్రతినిధులు, ఎంపీ/ ఎమ్మెల్యే/ ఎమ్మెల్సీ లాంటి ప్రజా ప్రతినిధులు, వృత్తి నిపుణులు, ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు, ప్రైవేట్ ఉద్యోగాలు చేసేవారు ఈ పథకానికి అర్హులు కాదు. ప్రభుత్వంలోని గ్రూప్ డి స్థాయి ఉద్యోగులకు, 10 వేల రూపాయల కంటే తక్కువ పింఛన్ తీసుకునే వ్యక్తులకు మినహాయింపు ఉన్నట్లు సమాచారం. 
 
సొంత భూమిని సాగు చేసుకోవటంతో పాటు కౌలు రైతులకు కూడా ప్రభుత్వం ఈ పథకం అందిస్తుంది. అర ఎకరా నుండి ఐదు ఎకరాల వరకు ఉద్యానవన తోటలు, ఎకరా నుండి ఐదు ఎకరాల వరకు వ్యవసాయ పంటలు సాగు చేసే వారికి ఈ పథకం వర్తిస్తుంది. కౌలు రైతులకు కూడా ఇవే నిబంధనలు వరిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000 రూపాయలను మినహాయించి మిగిలిన 6,500 రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుంది. 
 
కొన్ని జిల్లాల్లో నిన్నటి నుండి ఈ సర్వే ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. వ్యవసాయ అధికారులు మరియు గ్రామ రెవెన్యూ అధికారి ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తారని తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత అర్హుల జాబితాను విడుదల చేయటం జరుగుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: