నాక్కొంచెం తిక్కుంది. దానికో లెక్కుంది’- పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలోని డైలాగ్ ఇది. ప్రస్తుతం ఆయన రాజకీయ ప్రస్థానాన్ని చూస్తున్న వాళ్లకు ఆయనకు తిక్క ఉందన్న విషయం అర్థమవుతోంది. కానీ, దాని లెక్కే విచిత్రంగా ఉంది. రాష్ట్ర విభజన తీరును తప్పుపడుతూ ఆయన సుదీర్ఘ ప్రసంగం చేశారు. కాంగ్రెస్ ను వ్యతిరేకంగా రాజకీయ పార్టీని కూడా పెడతానన్నారు. కాంగ్రెస్ హటావో.. దేశ్ బచావో అని పిలుపు కూడా ఇచ్చారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ మీద కోపంగా ఉన్న చాలామంది ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. ఆయన పార్టీ పెడితే అండగా నిలబడాలని కూడా నిర్ణయించుకున్నారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ తెలుగుదేశంతో పొత్తు దిశగా అడుగులు వేస్తున్నారని మరికొంతమంది స్పష్టం చేశారు. అయితే, దీనిని కూడా చాలామంది కొట్టిపారేశారు. పవన్ కల్యాణ్ పవర్ స్టార్ కనక చంద్రబాబు సహా ప్రతి ఒక్కరినీ ఏకిపారేస్తారని, చివరికి చంద్రబాబును కూడా వదలరని చెప్పుకొచ్చారు. విచిత్రం ఏమిటంటే.. గత శుక్రవారం ఆయన పార్టీ పెట్టినట్లు ప్రకటన చేశారు. ఈ శుక్రవారం ఆయన అహ్మదాబాద్ వెళ్లి నరేంద్ర మోదీని కలిశారు. మధ్యలో చంద్రబాబుతో మంతనాలు జరిపారు. ఇప్పుడు విషయం సుస్పష్టంగా తేలిపోయింది. కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని నరేంద్ర మోదీ భుజాల మీద నుంచి చంద్రబాబు పేల్చిన ఆరడుగుల బుల్లెట్టే పవన్ కల్యాణ్ అని. రాష్ట్ర విభజన తీరును తీవ్రంగా తప్పుబట్టిన పవన్ కల్యాణ్ నరేంద్ర మోదీతోనూ, చంద్రబాబుతోనూ ఎలా పొత్తు పెట్టుకుంటారు. రాష్ట్ర విభజన పాపంలో వారిద్దరికీ భాగస్వామ్యం లేదా? రాష్ట్ర విభజనకు కేవలం కాంగ్రెస్ నే ఎందుకు తప్పుబడతారు? వాస్తవానికి, రాష్ట్ర విభజన పాపంలో మొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు. కేసీఆర్ బ్లాక్ మెయిలింగ్ కు, తెలంగాణ వాదుల ఒత్తిళ్లకు లొంగి ఆయన లేఖ ఇచ్చి ఉండకపోతే రాష్ట్ర విభజన జరిగేదే కాదు. అసలు విషయం ఇంత వరకు వచ్చి ఉండేదే కాదు. చంద్రబాబు ఇప్పుడు హైదరాబాద్ ను నేనే అభివృద్ధి చేశానని, తెలంగాణలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు నా పుణ్యమేనని అంటున్నాడు. కానీ, తెలంగాణకు అనుకూలంగా 2008లోనే ఆయన లేఖ ఇచ్చాడు. అప్పటికి ఆత్మ గౌరవ నినాదం రాలేదు. అప్పట్లో తెలంగాణ వెనకబడిందని, సీమాంధ్రులు దోచేశారని టీఆర్ఎస్, తెలంగాణవాదులు విమర్శిస్తున్నారు. అప్పట్లోనే చంద్రబాబు లేఖ ఇచ్చారంటే తెలంగాణ వెనకబడిందని ఆయన అంగీకరించినట్లేగా? తెలంగాణను సీమాంధ్రులు దోచుకున్నారన్న తెలంగాణవాదుల విమర్శలను ఆయన ఒప్పుకొన్నట్లేగా? రెండో విషయం.. చంద్రబాబు లేఖ ఇచ్చినందువల్లనే, తెలంగాణ అంశం ముందుకు కదిలింది. లేకపోతే, కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష సమావేశం పెట్టేది కాదు. పెట్టినా ప్రధాన ప్రతిపక్షం అంగీకరించకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేసేది కాదు. రెండు సార్లు లేఖలు ఇచ్చి, వెనక్కి తగ్గేది లేదని చెప్పిన తర్వాతే కాంగ్రెస్ ముందుకెళ్లింది. మరి, పవన్ కల్యాణ్ చంద్రబాబుతో ఎలా పొత్తు పెట్టుకుంటాడు? రాష్ట్రాన్ని విభజించినందుకు కాదని, రాష్ట్రాన్ని విభజించిన తీరునే తము పట్టుబట్టామని పవన్ కల్యాణ్ లేదా ఆయన అభిమానులో జనసేన కార్యకర్తలో (ఎవరైనా ఎక్కడైనా ఉండి ఉంటే) చెప్పవచ్చు. మరి, అత్యంత దారుణంగా రాష్ట్రాన్ని విభజించిన పాపంలో బీజేపీకి భాగస్వామ్యం లేదా? కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ అడ్డుకుని ఉంటే కాంగ్రెస్ పార్టీ అంత మూర్ఖంగా ముందుకు వెళ్లేదా? లోక్ సభలో ప్రత్యక్ష ప్రసారం నిలిపివేతకు సుష్మా స్వరాజ్ అంగీకరించారని, అందుకే దానిని నిలిపి వేసి బిల్లును ఆమోదించామని స్పీకర్ మీరాకుమార్ చెప్పారు. లోక్ సభలో ఎటువంటి చర్చ లేకుండా కేవలం 23 నిమిషాల్లోనే తెలంగాణ బిల్లును ఆమోదించడంలో బీజేపీ తప్పు ఏమీ లేదా? అద్వానీని సభకు రావద్దని చెప్పి.. సుష్మా స్వరాజ్, వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీ కలిసి కుట్ర పన్నలేదా? సుష్మా స్వరాజ్ ప్రసంగం పూర్తయిన వెంటనే నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడైన బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సుష్మ చేతులు పట్టుకుని అభినందనలు చెప్పలేదా? సోనియా పెద్దమ్మ అయితే తనను చిన్నమ్మగా గుర్తుంచుకోవాలని సుష్మ సభ సాక్షిగా చెప్పలేదా? అంటే, అత్యంత అమానవీయంగా, దారుణంగా, రాజ్యాంగ, చట్టపరమైన నిబంధనలు అన్నిటినీ ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును ఆమోదించడంలో కాంగ్రెస్ కు ఎంత పాపం ఉందో బీజేపీకి కూడా అంతే పాపం ఉంది. అటువంటి సమయంలో ఏ ముఖం పెట్టుకుని పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడు? ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు, మోడీలతో మంతనాలు జరుపుతాడు? దీనినిబట్టి గత శుక్రవారం పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలన్నీ చంద్రబాబు, మోడీ స్క్రిప్టు అన్న విషయం అర్థం కావడం లేదా? మోడీ ప్రధాన మంత్రి అయితే పవన్ కల్యాణ్ కు ఏకంగా ‘భారతరత్న’ బిరుదు ఇచ్చేసినా ఆశ్చర్యం ఏమీ లేదు. ఒకవేళ, రాష్ట్ర విభజన విషయం మోడీకి ఏమీ తెలియదని, ఆయన దేశవ్యాప్త ప్రచారంలో బిజీగా ఉన్నాడని పవన్ కల్యాణ్ అభిమానులు చెప్పవచ్చు. అయితే, పార్లమెంటు జరుగుతున్న సమయంలో మోడీని చంద్రబాబు కనీసం రెండు రోజులకు ఒకసారి కలిశాడు. అహ్మదాబాద్లో, ఢిల్లీలో, చండీగఢ్ విమానాశ్రయంలో.. ఇలా మోడీ ఎక్కడికి వెళితే చంద్రబాబు కూడా అక్కడికి వెళ్లి కలిశాడు. అప్పట్లో రాష్ట్ర విభజన జరగకుండా చూడాలని చంద్రబాబు మోడీని కలిసి కోరినట్లు కథనాలు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని బహిరంగంగా ప్రకటించారు. అటువంటి సమయంలో రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి కానీ, అప్రజాస్వామికంగా, అమానవీయంగా విభజన ప్రక్రియను చేయడానికి కానీ ‘కాబోయే ప్రధాని’ ఏమీ చేయలేదు కదా. అటువంటప్పుడు ఈ పాపంలో మోడీకి కూడా భాగస్వామ్యం ఉన్నట్లే కదా. ఒకవేళ, మోడీకి తెలియదని అనుకుంటే.. అన్ని సార్లు కలిసినప్పుడు చంద్రబాబు నాయుడు మోడీతో రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని కోరలేదన్నమాట. అత్యంత దారుణంగా విభజన ప్రక్రియ జరిగేలా చూస్తే.. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ను రంగంలోకి తీసుకొద్దామని, మీరు దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నట్లే ‘కాంగ్రెస్ హటావో, దేశ్ బచావో’ అనే నినాదాన్ని ఆయనతో పలికిద్దామని, దానికి మరింత పవిత్రత వస్తుందని చెప్పి ఉండాలి. దీనినిబట్టి, పవన్ కల్యాణ్ ను తెరపైకి తీసుకొచ్చే విషయం అప్పట్లోనే ఖరారై ఉండి ఉండాలి. పవన్ కల్యాణ్ కంటే ఇప్పుడు చిరంజీవి బెటరని అనిపిస్తున్నాడు. ఎందుకంటే చిరంజీవి పార్టీ పెట్టి ఎన్నికల్లో పోరాడి, వ్యూహాల్లో చతికిలపడి ఆ తర్వాత పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశాడు. కానీ, పవన్ కల్యాణ్ ముందుగానే కుమ్మక్కై.. ఒక పార్టీని దెబ్బతీయడం ద్వారా ఇతర పార్టీలకు లబ్ధి చేకూర్చడం కోసమే ఆయన పార్టీ పెట్టాడన్నమాట. ఇదే నిజమైతే.. ఎన్నికలకు కూడా వెళ్లకముందు గబ్బర్ సింగ్ గబ్బు పట్టి పోవడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: