దేశంలో శరవేగంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి భారీన సినీ ప్రముఖులు సైతం పడుతున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల క్రితం అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ఆరాధ్యలకు కరోనా నిర్ధారణ అయింది. అయితే తాజా వైద్య పరీక్షల్లో అమితాబ్ బ‌చ్చ‌న్‌కు, అభిషేక్ బచ్చన్ కు క‌రోనా నెగ‌టివ్ నిర్ధారణ అయిందని ప్రచారం జరుగుతోంది. 
అమితాబ్, అభిషేక్ కరోనా నుంచి వేగంగా కోలుకుంటున్నారని ఈరోజు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి.  
 
అతి త్వరలో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ డిశ్చార్జ్ కానున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నట్టు జాతీయ మీడియా ఛానెళ్లు కథనాలు ప్రసారం చేశాయి. అమితాబ్ ఫ్యామిలీలో జయా బచ్చన్ కు మాత్రమే కరోనా నెగటివ్ నిర్ధారణ అయింది. అమితాబ్ ఈ నెల 11వ తేదీన తనకు, తన కుమారునికి కరోనా సోకిందని ప్రకటించారు. పరీక్షల్లో పాజిటివ్ రావడంతో ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. అయితే అదేరోజు మధ్యాహ్నం ఐశ్వర్యారాయ్, ఆరాధ్యకు వైరస్ నిర్ధారణ అయింది. 
 
మొదట్లో హోం క్వారంటైన్ లోనే ఉండి చికిత్స పొందిన ఐశ్వర్యరాయ్, చిన్నారి ఆరాధ్య లక్షణాలు అధికం కావడంతో ఆసుపత్రిలో చేరారు. వీళ్లు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కావడానికి మరికొన్ని రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే వైరల్ అవుతున్న వార్తలను బిగ్ బీ ఖండించారు. ట్విట్టర్ ద్వారా తనకు కరోనా నెగిటివ్ అని సాగుతున్న ప్రచారం అబద్ధమని చెప్పారు. 
 
త‌న కుటుంబ స‌భ్యుల ఆరోగ్య ప‌రిస్థితుల గురించి, ఫ్యాన్స్ కి సూచ‌న‌లు చేస్తూ నానావ‌తి హాస్పిట‌ల్ నుంచి కొన్ని వీడియోలు సోష‌ల్ మీడియాలో అమితాబ్ పోస్ట్ చేశారు. అమితాబ్, ఆయన ఫ్యామిలీ త్వ‌ర‌గా కోలుకోవాలని పలువురు సెల‌బ్రిటీలు సైతం ఆకాంక్షించారు. మరోవైపు టాలీవుడ్, బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీల్లోని సినీ ప్రముఖులు సైతం కరోనా భారీన పడుతున్నారు. 


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: