మాజీ ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, తాడికొండ రాజయ్య మధ్య నెలకొన్న విబేధాలు మరోమారు బయటపడ్డాయి. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యను ఉద్దేశించి మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ  కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టేషన్‌ఘనపూర్ నియోజకవర్గంలో ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రుల మధ్య కోల్డ్ వార్ కాస్త ర‌చ్చ‌కెక్కింది శ‌నివారం రాత్రి స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌లో జ‌రిగిన ఓ క్రీడా కార్య‌క్ర‌మంలో క‌డియం శ్రీహ‌రి ఈ వ్యాఖ్య‌లు చేశారు. చేతకానివాడు, ఒక్క రూపాయి కూడా సహాయం చేయనివాడు చాలా మాట్లాడుతాడని.. చెల్లని రూపాయి అంటూ కామెంట్ చేయ‌డం సంల‌చ‌నం రేపుతోంది.  తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఏ ఒక్కరి దగ్గర ఛాయి తాగినా... పదవి ఇప్పిస్తాననో... పనులు ఇప్పిస్తాననో ఒక్క రూపాయి తీసుకున్నట్లు నిరూపించినా ముక్కు నేలకు రాస్తానని సవాల్ విసిరారు.


పదవులు అమ్ముకుంటున్నారు, పనులు అమ్ముకుంటున్నారని.. ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతూ...నీతిగా బ‌తికే వారిపై నిందలు వేస్తున్నారంటూ మండిప‌డ్డారు. నెత్తిమీద పది రూపాయలు పెడితే అమ్ముడు పోనివారు కూడా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. గ‌తంలోనూ  కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు పార్టీ వర్గాలను తీసుకెళ్లే విషయంలో స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో సాగుతున్న ఆధిపత్య పోరు బట్టబయలైంది. ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే టి.రాజయ్య కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శన కోసం పోటీపోటీగా తేదీలను ఖరారు చేసి, పోస్టర్లు, ఫ్లెక్సీలను విడుదల చేయడం టీఆర్‌ఎస్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులను కాళేశ్వరం బాట పట్టించే క్రమంలో వేర్వేరు తేదీలను ఖరారు చేయడం వివాదస్పదమవుతోంది.


 స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో కడియం శ్రీహరి టీడీపీ నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ హయంలో మంత్రిగా సైతం పని చేశారు. అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీఆర్ ఎస్‌లో చేరి వ‌రుస‌గా రెండు ప‌ర్యాయాలు విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం. ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నా ఇరువురు నేతలు, వారి అనుచరుల మధ్య ఘర్షణ పూరిత వాతావరణమే న‌డుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: