సీఎం కేసీఆర్ రూటే స‌ప‌రేట్‌.. ఆయ‌న ఏది చేసినా సంచ‌ల‌నంగానే ఉంటుంది. ప్ర‌తిప‌క్షాల నుంచి  విమ‌ర్శ‌ల స్థాయి పీక్‌కు వెళ్లిన స‌మ‌యంలో ఆయ‌న వ్యూహాత్మ‌కంగా వాటికి చెక్‌పెడుతూ ఉంటాడు. తాజాగా అదే ప‌రిస్థితి క‌నిపిస్తుంది. క‌రోనా సెకండ్ వేవ్ విజృంభిస్తుండ‌టంతో ప్ర‌జ‌లంతా భ‌య‌భ‌యంగా జీవ‌నం సాగిస్తున్నారు. కొవిడ్ కేసులు విప‌రీతంగా పెరుగుతున్న క్ర‌మంలో ఆస్ప‌త్రుల్లో స‌రియైన వ‌స‌తులు క‌ల్పించ‌డం లేద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. నిమ్స్‌, గాంధీ, వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్ప‌త్రుల్లో ప‌దుల సంఖ్యలో ప్ర‌జ‌లు మృత్యువాత ప‌డ్డారు. దీంతో ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌ల దాడిని పెంచాయి. ఇదే స‌మ‌యంలో కేసీఆర్ వారి విమర్శ‌ల‌కు ఒక్క‌సారిగా చెక్‌పెట్టారు. వ‌రుస‌గా ఆస్ప‌త్రుల బాట ప‌డుతూ త‌న‌దైన శైలిలో కోవిడ్ రోగుల్లో భ‌రోసాను క‌ల్పిస్తున్నారు.

ఈట‌లను కేబినెట్ నుంచి బ‌ర్త‌ర‌ఫ్ చేసిన త‌రువాత వైద్య ఆరోగ్య శాఖ సీఎం కేసీఆర్ త‌న‌వ‌ద్దే ఉంచుకున్నారు. అప్ప‌టి వ‌ర‌కు కొవిడ్ పాజిటివ్‌తో ఫాం హౌస్‌లో ఉన్న ఆయ‌న‌.. అక్క‌డి నుండే వైద్య ఆరోగ్య‌శాఖ అధికారుల‌తో స‌మీక్ష‌లు నిర్వ‌హించి వారిని అల‌ర్ట్ చేస్తూ వ‌చ్చారు. ఈ క్ర‌మంలో పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ కావ‌డం, ప్ర‌జ‌లు ఆస్ప‌త్రుల వైపు ప‌రుగులు తీయ‌డంతో బెడ్ల కొర‌త‌, ఆక్సిజ‌న్ కొర‌త తీవ్రంగా ఏర్ప‌డింది. ప‌లువురు మృత్యువాత ప‌డ్డారు. దీంతో కేసీఆర్‌పై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌ల దాడికి దిగాయి. ప్ర‌జ‌ల ప్రాణాలు అంటే లెక్క‌లేదా అందా అంటూ విమ‌ర్శ‌లు గుప్పించారు. వెంట‌నే లాక్‌డౌన్ విధించాల‌ని, ఆరోగ్య శ్రీ‌లో కొవిడ్‌ను చేర్చాల‌ని డిమాండ్ చేశారు.

కొవిడ్ నుంచి కోలుకున్న సీఎం.. రెండురోజుల పాటు వ‌రుస‌గా మంత్రులు, ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష‌లు జ‌రిపి రాష్ట్రంలో కొవిడ్ తీవ్ర‌త‌ను స‌మీక్షించారు. ఈనెల 12 నుంచి రోజుకు 20 గంట‌ల పాటు లాక్‌డౌన్ విధించారు. అంతేకాక కేంద్రంలో అమ‌లు చేస్తున్న‌ ఆయుష్మాన్ భార‌త్‌కు రాష్ట్రంలో అనుమ‌తి ఇస్తూ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. దీంతో బీజేపీ నేత‌ల చేత ప్ర‌శంస‌లు పొందారు. ప్ర‌తిప‌క్షాల నుంచి విమ‌ర్శ‌ల‌కు తావులేకుండా మ‌రుస‌టి రోజే గాంధీ ఆస్ప‌త్రికి వెళ్లారు కేసీఆర్‌. అక్క‌డ చికిత్స పొందుతున్న క‌రోనా రోగుల‌ను ప‌రామ‌ర్శించారు.

కేవ‌లం మాస్క్ ఒక్క‌టే ధ‌రించి వెళ్ల‌డం సంచ‌ల‌నంగా మారింది. భ‌య‌ప‌డొద్ద‌ని, నేనున్నానంటూ కోవిడ్ రోగుల్లో కేసీఆర్ భ‌రోసాను క‌ల్పించారు. వెంట‌నే వ‌రంగ‌ల్ ఎంజీఎం ఆస్ప‌త్రికి వెళ్లిన సీఎం.. అక్క‌డి కొవిడ్ రోగుల‌ను ప‌రామ‌ర్శించారు. ధైర్యంగా ఉండాల‌ని, మొండిగా క‌రోనాను ఎదుర్కోవాల‌ని సూచించారు. ఆదివారం ఖ‌మ్మం జిల్లా ఆస్ప‌త్రికి వెళ్లేందుకు కేసీఆర్ నిర్ణ‌యించుకున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి సింహం జూలు విదిల్చిన‌ట్లుగా వ‌రుస ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు చెక్‌పెడుతున్నారు కేసీఆర్‌.

మరింత సమాచారం తెలుసుకోండి: