గ్రేట‌ర్ ఎన్నికలు టీఆర్ ఎస్ బీజేపీల మ‌ధ్య‌నే  ఉండ‌నున్నాయ‌న్న‌ది స్ప‌ష్ట‌మైంది. కాంగ్రెస్ మూడో స్థానానికి ప‌డిపోయింది. గ్రేట‌ర్‌లో ప్ర‌జ‌లు బీజేపీ వైపు నిలుస్తార‌ని ఆ పార్టీ అధిష్ఠానం ర‌హస్యంగా చేయించిన స‌ర్వేలో తేలిన‌ట్లుగా పార్టీ శ్రేణుల మ‌ధ్య ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే గ్రేట‌ర్ సాధ్య‌మైన‌న్ని ఎక్కువ సీట్లు సాధించి వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల నాటికి సీఎం పీఠాన్ని కైవ‌సం చేసుకోవాల‌నే వ్యూహాత్మ‌క ధోర‌ణితో ఆ పార్టీ ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈనేప‌థ్యంలోనే గ్రేట‌ర్‌లో సాధ్య‌మైనంత ఎక్కువ బ‌లం ప్ర‌ద‌ర్శించాలంటే బ‌ల‌మైన నాయ‌కుల‌తో ప్ర‌చారం సాగించాల‌ని యోచిస్తోంది. అందులో భాగంగానే హోం మంత్రి అమిత్‌షాను ప్ర‌చారంలోకి దించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం. అమిత్‌షాతో పాటు ఉత్త‌ర ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య‌నాథ్‌తో పాటు ప‌లువురు కేంద్ర మంత్రుల‌చే ప్ర‌చారం చేయించేలా రాష్ట్ర నాయ‌కులు ప్ర‌ణాళిక‌ను రూపొందిస్తున్నారు.


బీజేపీ నాయ‌కులు చెబుతున్న దాని ప్ర‌కారం.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితర నేతలు రంగంలోకి దిగనున్నారు. ఇప్పటికే తొలిదశలో బీజేపీ యువ ఎంపీ తేజస్వి యాదవ్ హైదరాబాద్‌కు వచ్చి ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత పెద్దలు రానున్నారు. ఎన్నికల ప్రచారానికి కేవలం నవంబర్ 29 వరకే గడువు ఉంది. అంటే కేవలం ఇంకా 5 రోజులే ఉన్నాయి. ఈ క్రమంలో బీజేపీ పెద్దలు వరుసగా హైదరాబాద్‌కు క్యూ కట్టనున్నారు. అందరు నేతలు ఒకే రోజు కాకుండా, రోజుకో నేత ప్రచారానికి రానున్నట్టు తెలిసింది. చివరి ఘట్టంలో అమిత్ షా ప్రచారానికి రానున్నట్టు సమాచారం. ఎన్నికలకు రెండు రోజుల ముందు అమిత్ షా హైదరాబాద్‌లో పర్యటించి ప్రచారం చేస్తే ఆ జోష్ హైలో ఉంటుందని, అది ఎన్నికలకు పనికొస్తుందని నేతలు అంచనా వేస్తున్నారు.


గ్రేటర్‌లో ఇప్ప‌టికే రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది. అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటాపోటీ ప్రచారం సెగలు పుట్టిస్తోంది. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి గ్రేటర్‌ పోటీలో బీజేపీ రేసులోకి వచ్చింది. టీఆర్‌ఎస్‌ నేతలకు ధీటుగా ఎత్తుకు పైఎత్తులు వేస్తోంది. గ్రేటర్‌ పీఠమే లక్ష్యంగా కమలదళం పావులు కదుపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా నేతలందరినీ మోహరించి భాగ్యనగర్‌ బస్తీల్లో జోరు పెంచుతోంది. అధికార పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నీ తానై వ్యవహరిస్తుండగా.. గల్లీల్లో మంత్రులు తిష్టవేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం సోమవారం జరిగిన మీడియా సమావేశం ద్వారా హైదరాబాద్‌ వాసులపై వరాల జల్లు కురిపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: