ఈ మధ్య కొందరు టీడీపీ నేతలకు చంద్రబాబు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంతకాలం ఓపిక పడుతూ వచ్చిన బాబు...పని చేయకుండా, పార్టీని బలోపేతం చేయకుండా సైలెంట్‌గా ఉన్న నాయకులని సైడ్ చేసేశారు. పలు నియోజకవర్గాల్లో కొందరు నేతలని తప్పించి, కొత్త ఇంచార్జ్‌లని తీసుకొచ్చి పెట్టారు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ పుట్టిన గడ్డ అయిన పామర్రు నియోజకవర్గంలో కూడా బాబు మార్పులు చేశారు.

అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పనని పక్కనబెట్టి..సీనియర్ నేత వర్ల కుమార్ రాజాని ఇంచార్జ్‌గా పెట్టారు. అయితే మొదట నుంచి కల్పన టీడీపీలోనే పనిచేస్తూ వస్తున్నారు. కానీ మధ్యలో కల్పన వైసీపీలోకి వెళ్ళి 2014లో గెలిచి...మళ్ళీ టీడీపీలోకి వచ్చేశారు. ఇక అధికారంలో ఉన్నన్ని రోజులు బాగానే ఉన్నారు. కానీ 2019 ఎన్నికల్లో ఆమె ఘోరంగా ఓడిపోయారు. అసలు కృష్ణాలోనే ఎక్కువ మెజారిటీతో ఓడిపోయిన టీడీపీ నాయకురాలు కల్పన.

ఇంత దారుణంగా ఓడిపోవడానికి టీడీపీపై ఉన్న వ్యతిరేకత మాత్రమే కారణం కాదు...కల్పన సొంత తప్పిదాలు కూడా ఉన్నాయి. సరే ఓడిపోతే ఓడిపోయారు..ఆ తర్వాత నుంచైనా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలు చేస్తే పర్లేదు...కానీ ఆమె అలా చేయలేదు. పామర్రులో పార్టీని గాలికొదిలేశారు. వైసీపీపై పోరాటం చేసేది ఏమి లేదు. పైగా వైసీపీ నేతలతో టచ్‌లో ఉంటూ కావాల్సిన పనులు చేయించుకున్నారనే ఆరోపణలు తెచ్చుకున్నారు.

దీంతో పామర్రులో టీడీపీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది. అందుకే బాబు, కల్పనని సైడ్ చేసి కుమార్ రాజాకు బాధ్యతలు అప్పగించారు. ఇంచార్జ్ పదవి పోయాక కల్పన ఫుల్ సైలెంట్ అయిపోయారు. ఇక ఆమె మళ్ళీ వైసీపీలోకి వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె వైసీపీ నేతలతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మరి చూడాలి మాజీ ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన జంపింగ్ ఉంటుందో లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: