
ప్రధాని స్టార్మర్ ప్లాన్ ఏంటి?
వస్తున్న వార్తల ప్రకారం, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ కొత్త వీసా నిబంధనలపై ఒక శ్వేతపత్రాన్ని (ప్రభుత్వ ప్రతిపాదనల పత్రం) రెడీ చేస్తోంది. త్వరలోనే దీన్ని బ్రిటీష్ పార్లమెంటు ముందు ఉంచనున్నారు.
భారతీయులే ఎక్కువ... కానీ తగ్గుతున్న వీసాలు
గణాంకాలను పరిశీలిస్తే, 2024లో యూకే ప్రభుత్వం విదేశీయులకు దాదాపు 2,10,098 వర్క్ వీసాలను జారీ చేసింది. ఇది 2023తో పోలిస్తే ఏకంగా 37% తక్కువ. విశేషం ఏంటంటే, అన్ని దేశాల వారికంటే భారతీయులే అత్యధికంగా వర్క్ వీసాలు దక్కించుకున్నారు. జూన్ 2024తో ముగిసిన గత 12 నెలల్లో, భారతీయులకు సుమారు 1,16,000 వర్క్ వీసాలు మంజూరయ్యాయి. అయితే, 2023లో ఈ సంఖ్య 1,27,000గా ఉండటం గమనార్హం. మనవాళ్లు ఎక్కువగా హెల్త్‌కేర్, ఐటీ, ఇంజనీరింగ్, విద్య, హాస్పిటాలిటీ, క్యాటరింగ్, వాణిజ్యం వంటి రంగాల్లో ఉద్యోగాల కోసం యూకే బాట పడుతున్నారు.
ప్రభుత్వంపై ఒత్తిడి ఎందుకు?
వలసలను కట్టడి చేయాలంటూ యూకే ప్రభుత్వంపై రాజకీయంగా ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా, 'రిఫార్మ్ యూకే' అనే రాజకీయ పార్టీకి ప్రజాదరణ పెరుగుతుండటంతో, స్టార్మర్ ప్రభుత్వం వలస నిబంధనలను బిగించడంపై ఫోకస్ పెట్టింది. "యూకే దేశానికి నిజంగా ఉపయోగపడే వాళ్లను మాత్రమే ఇక్కడ ఉండేందుకు, పనిచేసేందుకు అనుమతిస్తాం" అని స్వయంగా ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
* మారుతున్న రూల్స్ ఇవేనా..
ప్రతిపాదిస్తున్న కొత్త నిబంధనల ప్రకారం, కొన్ని కీలక మార్పులు రానున్నాయి.
చదువు: స్కిల్డ్ వర్కర్ వీసా కావాలంటే కనీసం యూనివర్సిటీ డిగ్రీ తప్పనిసరి కానుంది. అంటే, బాగా చదువుకున్న వాళ్లకే ప్రాధాన్యత ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం.
ఇంగ్లీష్: ఇంగ్లీష్ భాషా నైపుణ్య పరీక్షలు మరింత కఠినతరం కానున్నాయి. అంతేకాదు, వీసా పొందిన వారిపై ఆధారపడి వచ్చే కుటుంబ సభ్యులకు (డిపెండెంట్లు) కూడా బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి.
పర్మనెంట్ రెసిడెన్సీ: శాశ్వత నివాసం (సెటిల్డ్ స్టేటస్) పొందడంలో కూడా భారీ మార్పు రానుంది. ప్రస్తుతం 5 ఏళ్లు యూకేలో ఉంటే సరిపోయేది, కానీ కొత్త రూల్స్ ప్రకారం ఏకంగా 10 ఏళ్లు యూకేలో నివసిస్తేనే శాశ్వత నివాసానికి అర్హత లభిస్తుంది.