క్రికెట్ అభిమానులకు అసలు సిసలైన పండగ రాబోతోంది. ఆసియా ఖండంలో క్రికెట్ ఆధిపత్యం కోసం జరిగే మహా సంగ్రామానికి రంగం సిద్ధమైంది. ఏసీసీ (ఆసియా క్రికెట్ కౌన్సిల్) అధ్యక్షుడు అయిన మోహ్సిన్ నఖ్వీ 2025 ఆసియా కప్ తేదీలను అధికారికంగా ప్రకటించడంతో అభిమానుల ఉత్సాహం ఆకాశాన్నంటింది.

సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఈ మెగా టోర్నమెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. రాబోయే టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ టోర్నీని కూడా టీ20 ఫార్మాట్‌లోనే నిర్వహించనున్నారు. ఈసారి టోర్నమెంట్ చరిత్రలోనే తొలిసారిగా 6 జట్లకు బదులుగా 8 జట్లు తలపడనున్నాయి.

అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లను గ్రూప్ ఏ లోనే ఉంచారు. దీంతో అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే దాయాదుల పోరుకు సెప్టెంబర్ 14వ తేదీని ముహూర్తంగా ఖరారు చేశారు. గ్రూప్ ఏ లో ఈ రెండు జట్లతో పాటు ఆతిథ్య యూఏఈ, ఒమన్ జట్లు కూడా ఉన్నాయి. ఇక గ్రూప్ బీలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్, హాంకాంగ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

ఈ టోర్నమెంట్ ఫార్మాట్ ప్రకారం, భారత్-పాకిస్థాన్ జట్లు ఫైనల్ చేరితే, ఏకంగా మూడుసార్లు ముఖాముఖి తలపడే అవకాశం ఉంది. లీగ్ దశలో సెప్టెంబర్ 14న జరిగే మ్యాచ్ తర్వాత, ఇరు జట్లు సూపర్-4 దశకు అర్హత సాధిస్తే సెప్టెంబర్ 21న మరోసారి తలపడతాయి. ఒకవేళ రెండూ ఫైనల్‌కు దూసుకెళ్తే, సెప్టెంబర్ 28న జరిగే ఫైనల్‌లో మూడోసారి ఎదురుపడతాయి. అయితే, ఆసియా కప్ చరిత్రలో ఇప్పటివరకు భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య ఫైనల్ జరగకపోవడం గమనార్హం.

వాస్తవానికి ఈ టోర్నమెంట్‌కు బీసీసీఐ అధికారిక హోస్ట్‌గా ఉన్నప్పటికీ, భారత్-పాకిస్థాన్ మధ్య ఉన్న రాజకీయ పరిస్థితుల కారణంగా, ఇరు దేశాల బోర్డుల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు టోర్నీని తటస్థ వేదిక అయిన యూఏఈకి తరలించారు.

ప్రస్తుత ఛాంపియన్‌గా భారత్ ఈ టోర్నీలో బరిలోకి దిగుతుండగా, 2022లో జరిగిన గత టీ20 ఎడిషన్‌లో శ్రీలంక విజేతగా నిలిచింది. ఈసారి పెరిగిన జట్లు, టీ20 ఫార్మాట్‌తో టోర్నీ మరింత రసవత్తరంగా సాగడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: