తెలంగాణాలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పి క్షీణించాయని ప్రభుత్వం అసలు కనిపించటం లేదని రాక్షసులు రాజ్యపాలన చేస్తున్నారని అనేక ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల జరిగిన లాయర్ దంపతుల దారుణ హత్య రేపిన కలవరం మరవక ముందే, నిన్న నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన ఇరువర్గాల ఘర్షణ గృహదహనాలు హత్యాయత్నాలు అత్యంత విస్మయం కలిగిస్తున్నాయి.




నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌, బాధితులకు మద్దతుగా నిలిచి స్వాంతన కలిగించటానికి హైదరాబాద్ నుంచి బైంసాకు వెళ్లేందుకు యత్నించారు. టీఆరెస్ ప్రభుత్వం తనకున్న రాజకీయ వ్యక్తిగత సాన్నిహిత్యం వలన ఎంఐఎం పార్టీకి మద్దతు నివ్వక తప్పక పోవటంతో - హిందువులు మైనారిటీగా ఉన్న భైంసాలో ప్రతి ఏటా దాడులు జరుగుతున్నాయని - భైంసాని ముస్లిం పట్టణంగా మార్చాలని స్థానిక ఎంఐఎం నాయకత్వం భావిస్తుందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆందోళన వ్యక్తం చేసారు. దీంతో అరవింద్ ‌ను పోలీసులు బంజారాహిల్‌ లో అడ్డు కున్నారు. అనంతరం అరవింద్‌ను ఆయన నివాసానికే తరలించి హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బైంసాలో పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు ఇంటి నుంచి బయటకు వెళ్లొదని అర్వింద్‌ కు పోలీసులు హుకుం జారీచేశారు.




ఇదిలా ఉండగా భైంసాలో చెలరేగిన అల్లర్లపై కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సోమవారం కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డికి ఫోన్ చేసి ఆరా తీశారు.  ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. ప్రస్తుతం అక్కడ నెలకొన్న పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు.




భైంసా‌లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ఈ సందర్భంగా కిషన్‌ రెడ్డి అమిత్‌షాకు తెలియజేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ఇక, భైంసాలో నెలకొన్న పరిస్థితులపై మరోసారి తెలంగాణ డీజీపీ తో మాట్లాడినట్టు కిషన్‌రెడ్డి చెప్పారు.



ప్రస్తుతం అక్కడ పరిస్థితి అదుపులో ఉన్నట్టు డీజీపీ తెలిపారని అన్నారు. నేరస్థులను త్వరలోనే పట్టుకుంటామని డీజీపీ హామీ ఇచ్చారని కూడా వెల్లడించారు. ఇక, అంతకు ముందు భైంసాలో జరిగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నట్టు కిషన్‌రెడ్డి చెప్పారు. మీడియా సిబ్బందిపైన దాడి దురదృష్టకరమని, అది తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు.

 


భైంసాలో ఆదివారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఇరు వర్గాలకు చెందిన వ్యక్తుల మధ్య చోటు చేసుకున్నగొడవ, అల్లర్లకు దారితీసినట్టుగా తెలుస్తోంది. పోలీసులు అల్లర్లను అదుపు లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుండగానే కొందరు వాహనాలు, దుకాణాలకు నిప్పంటించడంతో అవి దహనమయ్యాయి. ఇరువర్గాలు తలలు పగిలేలా రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఈ ఘర్షణల్లో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిలో చిన్నారులు, మహిళలు, ఓ ఎస్సై, కానిస్టేబుల్‌ తో పాటుగా ఇద్దరు ఎలక్ట్రానిక్ మీడియా సిబ్బంది కూడా ఉన్నారు.




ఈ ఘర్షణల్లో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అక్కడి పరిస్థితులను పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఆ ప్రాంతంలో 144 సెక్షన్ విధించారు. 600 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


 


నిర్మల్ జిల్లా భైంసాలో మరో సారి ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణను కవర్ చేయడానికి వెళ్లిన ఇద్దరు జర్నలిస్టులపై అల్లరి మూకలు దాడిచేసి తీవ్రంగా గాయపర్చడాన్ని తెలంగాణ యూనియన్ ఆప్ వర్కింగ్ జర్నలిస్టు(టియుడబ్ల్యుజె ) నాయకులు తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులు వృత్తి ధర్మంలో భాగంగా ఎలాంటి సంఘటన జరిగినా అక్కడికి వెళతారని, అలా వెళ్లిన వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. దీనిని ‘టియుడబ్ల్యుజె’ తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. దాడిలో గాయపడ్డ దేవా, విజయ్ అనే జర్నలిస్టులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

ఇలాంటి ఘర్షణలకు పాల్పడుతున్న అల్లరి మూకలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ ఘర్షణలో పోలీసులు కూడా బాధితులేనని, దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని జర్నలిస్టు సంఘం డిమాండ్ చేసింది.



భవిష్యత్ లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం, పోలీసులు చర్యలు తీసుకోవాలి కోరుతున్నట్టు చెప్పారు. ఈ మేరకు టియుడబ్ల్యుజె అల్లం నారాయణ, ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్, టియుడబ్ల్యుజె అధ్యక్షుడు ఇస్మాయిల్, ప్రధాన కార్యదర్శి ఎ. రమణ కుమార్, టియుడబ్ల్యుజె  హైదరాబాద్ అధ్యక్షుడు యోగానంద్, ప్రధాన కార్యదర్శి యార నవీన్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు.



ప్రతి సంవత్సరం పునరావృతమవుతున్న ఈ ధనుష్ట్యం వెనుక ముందే రచించుకున్న ప్రణాళిక ఉందని, ఇక్కడే పలువురు రొహ్యాంగాలకు దొంగ పాస్స్పోర్టులు పొందటంలో పోలీస్ విభాగం పాత్ర కూడా ఉందని పలువురు భావిస్తున్నారు. 




మరింత సమాచారం తెలుసుకోండి: