
మరి చాలా మంది యువతలో ఒక భయం ఉంటుంది – “మా అమ్మానాన్నలకు షుగర్ ఉంది కాబట్టి మాకూ తప్పకుండా వస్తుంది” అని నమ్మకం. కానీ వైద్యులు చెప్పే ప్రకారం ఇది పూర్తిగా నిజం కాదు. జెనెటిక్ ప్రభావం వల్ల షుగర్ వచ్చే అవకాశం 50% వరకే ఉంటుంది. అంటే తల్లిదండ్రులకు షుగర్ ఉన్నా కూడా పిల్లలకు రాకుండా నివారించుకోవచ్చు. అందుకు సరైన జీవనశైలి పాటించడం, ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్‌లో పెట్టుకోవడం చాల ముఖ్యమని డాక్టర్లు చెబుతున్నారు.అయితే, ఎవరికైనా నిజంగా షుగర్ వచ్చిందా లేదా తెలుసుకోవడానికి రక్తపరీక్ష చేయించుకోవడమే ఖచ్చితమైన పద్ధతి. కానీ, రక్తపరీక్ష చేయించకముందే కొన్ని స్పష్టమైన లక్షణాలు మన శరీరంలో కనబడతాయి. ఆ లక్షణాలను గుర్తిస్తే ముందుగానే అలర్ట్ అయి డాక్టర్‌ను సంప్రదించడం ద్వారా పరిస్థితి కంట్రోల్ లోకి తెచ్చుకోవచ్చు.
అలాంటి ముఖ్యమైన లక్షణాలు ఇవే:
*తరచుగా మూత్ర విసర్జన చేయడం:
షుగర్ వస్తుందనే మొదటి సంకేతం ఇది. సాధారణంగా రోజూ ఒక పరిమిత సంఖ్యలోనే మూత్ర విసర్జన చేస్తాం. కానీ షుగర్ మొదలైనప్పుడు, ముఖ్యంగా రాత్రి పూట తరచుగా లేచి బాత్రూమ్‌కి వెళ్లాల్సి వస్తుంది. ఈ పరిస్థితి ఎప్పటికప్పుడు జరుగుతుంటే, వెంటనే ఒకసారి డాక్టర్‌ని సంప్రదించి రక్తపరీక్ష చేయించుకోవాలి.
*ఎక్కువగా నీళ్లు తాగడం, దాహం ఎక్కువగా అనిపించడం:
సాధారణంగా మనం ఒక పరిమిత మోతాదులోనే నీళ్లు తాగుతాం. కానీ షుగర్ కారణంగా దాహం ఎక్కువగా వేస్తూ ఉంటుంది. ఎన్ని సార్లు నీళ్లు తాగినా దాహం తీరనట్టుగా అనిపిస్తుంది. ఇది ఒక ముఖ్యమైన హెచ్చరిక సంకేతం. ఈ పరిస్థితి వస్తే ఆలస్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించి షుగర్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.
*అసాధారణంగా బరువు తగ్గిపోవడం:
చాలా తిన్నా, సరైన ఆహారం తీసుకున్నా కూడా బరువు క్రమంగా తగ్గిపోవడం కూడా డయాబెటిస్‌కి సూచన కావచ్చు. ఎలాంటి కారణం లేకుండా బరువు తగ్గడం అంటే అది డేంజర్ సిగ్నల్. ఈ లక్షణం కనబడిన వెంటనే వైద్యుల దగ్గరికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలి.
పై చెప్పిన మూడు లక్షణాలు (తరచుగా మూత్ర విసర్జన, ఎక్కువ దాహం, బరువు తగ్గడం) కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఇది సాధారణ సమస్య కాదు. వెంటనే రక్తపరీక్ష చేయించుకుని, రిజల్ట్ ప్రకారం డాక్టర్ సూచించిన మందులు వాడటం, అలాగే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం. షుగర్‌ని మొదటి దశలోనే గుర్తిస్తే అది పెద్ద సమస్యగా మారకుండా నియంత్రించుకోవచ్చు..!