
మహేష్ బాబు కెరీర్ లో తొలి ఇండస్ట్రీ హిట్ మూవీ `పోకిరి`. పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం 2006లో విడుదలై సంచలన విషయాన్ని నమోదు చేసింది. అయితే ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ మహేష్ బాబు కాదు. పూరీ జగన్నాథ్ మొదట రవితేజతో పోకిరి చిత్రాన్ని తీయాలనుకున్నారు. అప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన `ఇడియట్`, `అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి` చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే రవితేజతో పోకిరి తీసి హ్యాట్రిక్ హిట్ కొట్టాలని పూరీ భావించారు. కానీ ఆ సమయంలో రవితేజ చేతిలో `షాక్`, `విక్రమార్కుడు`, `ఖతర్నాక్` వంటి ప్రాజెక్ట్స్ ఉండటంతో డేట్లు సద్దుబాటు చేయలేక పూరీకి నో చెప్పారు. దాంతో మహేష్ బాబుతో పోకిరి తీసి కెరీర్ లోనే మర్చిపోలేని విజయాన్ని అందించారు పూరీ.
మహేష్ బాబు కెరీర్లో మరో సూపర్ హిట్ చిత్రం `దూకుడు`. శ్రీను వైట్ల ఈ చిత్రానికి దర్శకుడు. అయితే మహేష్ కన్నా ముందు దూకుడు కథ రవితేజ వద్దకు వెళ్లిందట. ఏవో కారణాలతో రవితేజ రిజెక్ట్ చేయగా.. అదే కథను మహేష్ బాబుకు చెప్పి మెప్పించాడు శ్రీను వైట్ల. కట్ చేస్తే దూకుడు సినిమా సూపర్ హిట్ అయింది. ఇక కొరటాల శివ, మహేష్ బాబు కాంబినేషన్‌లో వచ్చిన `శ్రీమంతుడు` సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విశేషమేంటంటే.. శ్రీమంతుడు మూవీ కథ కొరటాల ముందుగా రవితేజకు వినిపించారట. కానీ ఈ స్టోరీని కూడా ఆయన మిస్ చేసుకున్నారు. అదే మహేష్ బాబుకు వరమైంది.