భారతదేశం గర్వించదగ్గ శాస్త్రవేత్త, మనందరి ప్రియతమ మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం వెండితెరపైకి రాబోతోంది. ఈ పవర్ ఫుల్ బయోపిక్ కు ‘కలాం: ది మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సంచలన ప్రకటన 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో జరిగింది. ఇందులో కలాం పాత్రను నేషనల్ అవార్డు విన్నర్, స్టార్ యాక్టర్ ధనుష్ పోషించనుండటం విశేషం.

ఈ చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు 'ఆదిపురుష్' ఫేమ్ ఓం రౌత్ చేపట్టనున్నారు. 'ది కశ్మీర్ ఫైల్స్' వంటి సంచలన చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్, టి-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ తో కలిసి ఈ భారీ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. స్క్రీన్ ప్లే విషయానికొస్తే, 'నీర్జా', 'మైదాన్' వంటి సూపర్ హిట్ బయోపిక్ లకు కథ అందించిన సైవిన్ క్వాడ్రాస్ ఈ చిత్రానికి కలం పవర్ చూపిస్తున్నారు.

సినిమా కథ కలాం స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాన్ని మన కళ్లకు కట్టనుంది. రామేశ్వరంలోని ఆయన సాధారణ బాల్యం నుంచి మొదలుపెట్టి, భారతదేశ క్షిపణి కార్యక్రమాలలో అగ్రగామి శాస్త్రవేత్తగా ఆయన ఎదిగిన తీరు, చివరకు భారత 11వ రాష్ట్రపతిగా ఆయన సేవలందించిన కాలాన్ని ఈ చిత్రం అద్భుతంగా ఆవిష్కరించనుంది.

కలాం స్వయంగా రాసుకున్న బెస్ట్ సెల్లింగ్ ఆటోబయోగ్రఫీ ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. కేవలం శాస్త్రవేత్తగా, నాయకుడిగా ఆయన సాధించిన విజయాలే కాకుండా, ఆయనలోని సున్నితమైన కోణాలను, ఒక కవిగా, ఉపాధ్యాయుడిగా, గొప్ప ఆలోచనాపరుడిగా కూడా ఈ చిత్రం మనకు పరిచయం చేయనుంది.

దర్శకుడు ఓం రౌత్ మాట్లాడుతూ, "డాక్టర్ కలాం రాజకీయాలకు అతీతంగా నిలిచిన అరుదైన నాయకుడు. ఆయన గురించి సినిమా తీయడం ఒక పెద్ద బాధ్యత, అదే సమయంలో సృజనాత్మక సవాలు కూడా" అన్నారు.

నిర్మాత అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని "ఒక భావోద్వేగ ప్రయాణం"గా అభివర్ణించారు. "భారతరత్న కలాం కథను పంచుకునే అవకాశం దక్కడం మాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాం" అని ఆయన అన్నారు. భూషణ్ కుమార్ మాట్లాడుతూ, "ఇది కేవలం ఒక సినిమా మాత్రమే కాదు. కలలు, కఠోర శ్రమ, దయ ఒక దేశాన్ని మార్చగలవని నిరూపించిన మహనీయుడికి ఇది ఒక నివాళి" అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: