
తెలుగు సంస్కృతి, సినిమా, సమాజ సేవల్లో తనదైన ముద్ర వేసిన రియల్ లెజెండ్ ఎన్టీఆర్. అటువంటి వ్యక్తి చివరి రోజులు చాలా కష్టంగా ముగిశాయని అంటుంటారు. సినిమా రంగంలో అగ్ర కథానాయకుడిగా గుర్తింపు పొందిన ఎన్టీఆర్.. 60ఏళ్ల వయసులో రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి, తెలుగు దేశం పార్టీని స్థాపించారు. మొదటి ఎన్నికల్లోనే భారీ మెజారిటీతో గెలుపొంది ముఖ్యమంత్రి అయ్యారు. దేశంలోనే ఇదొక అరుదైన ఘనత.
అయితే 1985లో ఎన్టీఆర్ భార్య బసవతారకం క్యాన్సర్‌తో కన్నుమూశారు. 1993లో 70 ఏళ్లకు చేరవవుతున్న తరుణంలో లక్ష్మీ పార్వతి అనే రచయిత్రిని ఆయన రెండో వివాహం చేసుకున్నారు. అప్పట్లో ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. 1995లో ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగివచ్చిన తర్వాత, పార్టీలో భార్య లక్ష్మీ పార్వతికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం కొంతమంది కుటుంబ సభ్యులకు, పార్టీ నేతలకు నచ్చలేదు. అదే సమయంలో ఎన్టీఆర్ అల్లుడు, ప్రస్తుత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ మీద తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యేల మద్దతుతో పార్టీలో అధికారాన్ని సొంతం చేసుకున్నారు.
పార్టీని తానే స్వయంగా స్థాపించి, ప్రజల మద్దతుతో గెలిచిన తర్వాత, అదే పార్టీ నుండి తనను తప్పించడాన్ని ఎన్టీఆర్ జీర్ణించుకోలేకపోయారు. దానికి తోడు కొంతమంది కుటుంబ సభ్యులతో తెగదెంపులు ఆయన మనసును మరింత గాయపరిచాయి. ఆ దిగులుతో బయట పెద్దగా కనిపించకుండా ఇంట్లోనే ఉండిపోయారు. 1996 జనవరి 18 తెల్లవారుఝామున ఎన్టీఆర్ గుండెపోటుతో మరణించారు. మరణానికి ముందు కొన్ని రోజుల పాటు ఆయన పెద్దగా ఎవరినీ కలవలేదు.
ప్రజల గుండెల్లో దేవుడిగా నిలిచిన ఒక గొప్ప మనిషి తన చివరి రోజుల్లో ఒంటరితనం, రాజకీయ ద్రోహం, ఆవేదన మధ్య నిశ్శబ్దంగా అస్తమించారు. ఇక ప్రజలకు సేవ చేయాలన్న తపన, భార్య పేరుతో ప్రారంభించిన బసవతారకం హాస్పిటల్ అభివృద్ధి కావాలన్న ఆకాంక్ష, అలాగే తన పిల్లలు, కుటుంబ సభ్యులు ఐక్యంగా ఉండాలన్న ఆశే ఎన్టీఆర్ చివరి కోరికలుగా చెబుతారు.