తాజాగా అమెరికా రాయబార కార్యాలయం కాన్సులర్‌ వ్యవహారాల మంత్రి డాన్‌ హెఫ్లిన్‌ భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు. కోవిడ్ 19 వ్యాక్సిన్ తీసుకున్నట్టుగా ప్రూఫ్ చూపించకుండానే అమెరికాలో అడుగు పెట్టొచ్చని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ప్రూఫ్ చూపించకపోయినా.. కరోనా నెగిటివ్ రిపోర్టు మాత్రం సమర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే కరోనా సోకిన వారిని తమ దేశంలోకి అమెరికా అడుగుపెట్టనివ్వడం లేదు. "అమెరికాకి రావాలనుకునే విద్యార్థులు కోవిడ్ 19 నిర్ధారణ పరీక్షలో తేలిన నెగిటివ్ రిపోర్ట్ వారితో పాటు తెచ్చుకోవాలి. వారు బయలుదేరే 72 గంటలకు ముందుగానే నెగిటివ్ రిపోర్టు ఇవ్వాలి," అని ఆయన అన్నారు.


వేల మంది భారతీయ విద్యార్థులు జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి అమెరికా వీసా అపాయింట్‌మెంట్‌ పొందారని మంగళవారం రోజు అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. భవిష్యత్తులో మరిన్ని అపాయింట్‌మెంట్లు ఓపెన్ చేస్తామని ఈ సందర్భంగా యూఎస్ ఎంబసీ స్పష్టంచేసింది. అయితే కొద్ది రోజుల క్రితం అర్హత కలిగిన విద్యార్థులకు వీసా ఇచ్చేందుకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని వెల్లడించడంతో వేలకొద్దీ భారతీయులు అమెరికన్ అఫీషియల్ వెబ్సైట్ లో లాగిన్ అవడం ప్రారంభించారు. దీంతో వెబ్సైటు లో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తాయి.



ఐతే అమెరికా రాయబార కార్యాలయం ఇంటర్వ్యూ స్లాట్స్ బుక్ చేసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉందని.. తాము అపాయింట్‌మెంట్లు మరికొన్ని వారాల పాటు ఓపెన్ చేసే ఉంచుతామని.. కంగారు పడాల్సిన అవసరం లేదని వెల్లడించింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆందోళనలను తాము అర్థం చేసుకోగలమని.. తాము ప్రస్తుతం చాలా యాక్టివ్ గా పనిచేస్తూ వీసాలు మంజూరు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని డాన్‌ హెఫ్లిన్‌ వెల్లడించారు. ఇకపోతే రెండు నెలల వ్యవధిలోనే అమెరికాలోని విద్యాసంస్థల్లో సెమిస్టర్స్ ప్రారంభంకానున్నాయి. కొద్ది రోజుల వరకు అమెరికా విద్యాసంస్థలు భారతీయ విద్యార్థులను అనుమతించబోమని కరాఖండిగా చెప్పుకొచ్చింది. దీంతో భారతీయ అధికారులు అమెరికా ఉన్నతాధికారులతో చర్చించి సమస్యను పరిష్కరించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: