జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ మలి సభకు రెడీ అయ్యారు. హైదరాబాద్‌లో గ్రాండ్‌గా పార్టీ ఆవిర్భావ సభను నిర్వహించిన పవన్... రెండో సభను విశాఖపట్నంలో పెట్టబోతున్నారని తెలిసింది. ఈనెల 25 లేదా 27న సభ నిర్వహించే అవకాశముంది. సభను గ్రాండ్ సక్సెస్ చేసేందుకు పవన్ ప్రతినిధులు కృషి చేస్తున్నారు. దాదాపు లక్ష మంది జనాన్ని సమీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఎదురు దాడికి దిగాయి. అసలు విధివిధానాలు, సిద్ధాంతాలేంటో చెప్పకుండా పార్టీ పెట్టడమేంటని ఎద్దేవా చేశాయి. దీంతో విశాఖ సభలో జనసేన పార్టీ విధివిధానాలను వెల్లడించే సూచనలున్నాయి. అయితే తొలి సభలోనే కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లను ఏకిపారేసిన పవన్... విశాఖ మీటింగ్‌లో ఎవర్ని టార్గెట్ చేస్తారా అని రాజకీయ వర్గాల్లో కలకలం మొదలైంది. రాష్ట్ర విభజన తర్వాత పార్టీ పెట్టిన పవన్... తొలిసారి సీమాంధ్రలో మీటింగ్ నిర్వహించబోతున్నారు. దీంతో సీమాంధ్ర ప్రజలకు పవన్ కల్యాణ్‌ ఎలాంటి సందేశం ఇస్తారా అని ఉత్కంఠ నెలకొంది. వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందో, లేదో ఇప్పుడే చెప్పలేనని జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ అన్నారు. అయితే బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీని కలిసేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మోడీ అపాయింట్‌మెంట్ కూడా కోరినట్లు తెలిసింది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబుతో కూడా పవన్ టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో పవన్ కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలన్న భావనతోనే ఉన్నారని తెలుస్తోంది. అయితే ఎన్నికల్లో పోటీ చేస్తారా, లేక కాంగ్రెస్‌ను ఓడించేందుకు టీడీపీ, బీజేపీ లాంటి పార్టీలకు మద్దతిస్తారా అన్నది తెలియడం లేదు. విశాఖ సభలో ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: