భారత్ లో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. కరోనా కేసుల సంఖ్య, మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఊసరవెల్లి ఏ విధంగా రంగులను మారుస్తుందో కరోనా వైరస్ అదే విధంగా రూపాన్ని మార్చుకుంటూ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. శాస్త్రవేత్తలు కరోనా వైరస్ లో ఏకంగా 3,427 ఉత్పరివర్తనాలను గుర్తించడం గమనార్హం. ప్రస్తుతం శాస్త్రవేత్తలు వైరస్ జన్యుక్రమాన్ని నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కరోనా వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నారు.
 
హైదరాబాద్‌లోని సీసీఎంబీలో దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లోని 35 ల్యాబ్‌లు 2,321 వైరస్‌ల జన్యుక్రమాలపై పరిశోధనలు చేసి 3,427 ఉత్పరివర్తనాలను గుర్తించాయి. ఈ పరిశోధనల్లో ఏ2ఏ రకం వైరస్ ఎక్కువగా వ్యాప్తి చెందుతోందని తెలుస్తోంది. శాస్త్రవేత్తలు విశ్లేషించిన జీనోమ్‌లలో 68 శాతం ఏ2ఏ రకం, 20 శాతం వరకు ఐ/ఏ3ఐ రకం వైరస్ గా గుర్తించారు. తెలంగాణలో 330 జీనోమ్ లను విశ్లేషించగా 72 శాతం మందికి ఏ2ఏ వైరస్ 25 శాతం మందికి ఏ3ఐ రకం వైరస్ సోకినట్టు గుర్తించారు.
 
శాస్త్రవేత్తలు వైరస్ నిర్మాణంలో మార్పులు కలుగుతున్న కొద్దీ వ్యాధి లక్షణాల్లో మార్పులు కలుగుతున్నాయని చెప్పారు. తలనొప్పి, శ్వాస సంబంధిత లక్షణాలు, జలుబును మొదట్లో కరోనా లక్షణాలుగా అనుమానించగా ప్రస్తుతం రుచి కోల్పోవడం, వాసన గుర్తించకపోవడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వైరస్ లో మార్పులు చోటు చేసుకుంటున్న క్రమంలో వైరస్ ను వ్యాక్సిన్ అడ్డుకోగలదా...? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
 
వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు ఏదో ఒక రకం వైరస్‌ను ఎంచుకొని వైరస్ ను నిర్వీర్యం చేసే వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తాయి. కొత్త రూపంలోకి మారిన వైరస్‌ ను వ్యాక్సిన్ అడ్డుకుంటుందా...? అంటే ఇప్పుడే చెప్పలేం అనే సమాధానమే వినిపిస్తోంది. వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో వైరస్ ను కట్టడి చేస్తుందో లేదో చెప్పలేమని వైరస్‌లో వచ్చే మార్పులను వ్యాక్సిన్‌ సమర్థంగా అడ్డుకోలేకపోయినా వ్యాధి ప్రభావాన్ని మాత్రం తగ్గించగలుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉత్పరివర్తన వైరస్‌లను అడ్డుకుంటుందా? ప్రతిరక్షకాలు ఎంతకాలం ఉంటాయి? వంటి ప్రశ్నలకు మరికొన్ని సంవత్సరాలు ఆగితే సమాధానం దొరుకుతుందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేష్ మిశ్రా చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: