సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలోని పేద ప్రజలకు శుభవార్త చెప్పారు. కరోనా కేసులు రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో ఈ నెల 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అద్భుతమైన రీతిలో ప్రజలందరూ జనతా కర్ఫ్యూకు సంఘీభావం తెలిపారని కేసీఆర్ అన్నారు. కర్ఫ్యూకు సంఘీభావ ఐక్యత చాటిచెప్పిన ప్రతి తెలంగాణ బిడ్డకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రకటన చేశారు. 
 
ఈరోజు రాష్ట్రంలో 5 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయని సీఎం అన్నారు. ఉన్నత స్థాయి కమిటీ కరోనా నివారణ కోసం చర్చించిందని చెప్పారు. 31 వరకు ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజలు అత్యవసరమైతే మాత్రమే బయటకు రావాలని సూచించారు. బయటకు వచ్చిన వ్యక్తులు కనీసం మూడు అడుగుల దూరం పాటించాలని చెప్పారు. 
 
ఆర్టీసీ బస్సులు, ట్యాక్సీలు, ఆటోలు తప్పనిసరిగా బంద్ పాటించాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని చెప్పారు. అత్యవసర సర్వీసుల ఉద్యోగులు మాత్రం తప్పక హాజరు కావాల్సిందేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఒక్కో రేషన్ కార్డుకు 12 కిలోల రేషన్ బియ్యం ఉచితంగా ఇస్తామని అన్నారు. 
 
ఇందుకోసం 3.36 టన్నుల బియ్యం ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ప్రకటన చేశారు. ప్రతి రేషన్ కార్డుదారుకు బియ్యంతో పాటు 1500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అంతర్రాష్ట్ర సరిహద్దులు ఈ నెలాఖరు వరకు మూసివేశామని చెప్పారు. రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలను ఎట్టి పరిస్థితులలోను అనుమతించమని అన్నారు. రాష్ట్రంలో బార్లు, పబ్ లతో పాటు మద్యం దుకాణాలను కూడా మూసివేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటన చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 3,357 కొత్త కేసులు నమోదయ్యాయని అన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు స్వీయ నిర్భంధం పాటించాలని... వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: