
ఈ ఆధిపత్య పోరు నేపథ్యంలోనే విజయవాడ టిడిపిలో కీలకంగా ఉండే ఎంపీ కేశినేని నాని రాజకీయాలకు దూరం అవ్వాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే బుద్దా వెంకన్న, బోండా ఉమాలతో కేశినేనికి పడటం లేదు. ఈ క్రమంలోనే రాజకీయాలకు దూరం అవ్వాలని నాని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అటు తన కుమార్తె శ్వేత కూడా రాజకీయాలకు దూరం అవ్వనున్నారని కూడా ప్రకటించేశారు. నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ పోటీ చేయబోమని చెప్పేశారు.
ఇక విజయవాడ ఎంపీ అభ్యర్ధిగా మరొకరిని పెట్టుకోవాలని నాని చెప్పేశారు. అయితే చంద్రబాబు, కేశినేనితో మాట్లాడి...మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ చేస్తారా? లేదా? అనేది చూడాలి. ఒకవేళ బాబు మాట్లాడినా కేశినేని ఒప్పుకుంటారా? లేదా? అనేది కూడా చెప్పలేం. ఈ క్రమంలోనే విజయవాడ పార్లమెంట్ బరిలో దిగేందుకు బుద్దా వెంకన్న ప్రయత్నిస్తున్నారని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతుంది. ఆయనే విజయవాడ పార్లమెంట్ సీటు రేసులో ఉన్నారని తెలుస్తోంది.
అటు విజయవాడ వెస్ట్ సీటు కూడా దక్కించుకోవాలని బుద్దా వర్గం చూస్తోంది. బుద్దా వర్గంలో ఉన్న నాగుల్ మీరా ఎప్పటినుంచో వెస్ట్ సీటు దక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే ఇప్పుడు కేశినేని సైడ్ అవ్వనుండటంతో బెజవాడ రాజకీయాల్లో బుద్దా వర్గంది పైచేయి అయ్యేలా కనిపిస్తోంది. మరి కేశినేని వర్గంలో ఉన్న గద్దె రామ్మోహన్ ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి. మొత్తానికైతే బెజవాడ టిడిపిలో చిన్నపాటి వార్ జరుగుతుంది.