ఏపీలో రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి బాగా ఇబ్బందుల్లో ప‌డింది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ఓడిపోయినా ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో సీనియ‌ర్లు పోటీ చేయ‌డంతో చాలా చోట్ల గ‌ణ‌నీయ‌మైన ఓట్లు తెచ్చుకుంది. 2019 ఎన్నిక‌ల్లో ఒక్క ర‌ఘువీరారెడ్డి మిన‌హా కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన ఎవ్వ‌రికి చెప్పుకోద‌గ్గ ఓట్లు రాలేదు. అయితే ఇప్పుడు మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలుగా ష‌ర్మిల రావ‌డం.. అటు దేశ‌వ్యాప్తంగా ప‌దేళ్ల మోడీ పాల‌న‌పై వ్య‌తిరేక‌త‌.. అది కూడా సౌత్‌లో ఎక్కువుగా ఉండ‌డంతో కాంగ్రెస్‌కు భ‌విష్య‌త్తు ఉంటుంద‌న్న ఆశ‌లు చిగురిస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే టీడీపీ, వైసీపీ, బీజేపీ, జ‌న‌సేన లాంటి ప్ర‌ధాన పార్టీల నుంచే కాకుండా కాంగ్రెస్ నుంచి సైతం ఆర్థికంగా బ‌లంగా ఉన్న ఎన్నారైలు రంగంలోకి దిగుతున్నారు. ఏలూరు పార్ల‌మెంటు స్థానం నుంచి ఎన్నారై కావూరు లావ‌ణ్య పోటీకి దిగుతున్నారు. కావూరు అంటేనే ఏలూరు పార్లమెంటులో ఒక బ్రాండ్‌. కేంద్ర మాజీ మంత్రి కావూరు సాంబ‌శివ‌రావు 2004, 2009 ఎన్నిక‌ల్లో రెండుసార్లు ఎంపీగా గెల‌వ‌డంతో పాటు కేంద్ర మంత్రిగా ప‌నిచేసి ఏలూరు పార్లమెంటు నియోజ‌క‌వ‌ర్గంపై త‌న ముద్ర వేసుకున్నారు.

ఏలూరుకు ఎంత మంది ఎంపీలు వ‌చ్చినా కావూరు బ్రాండ్‌, ఆయ‌న చేసిన అభివృద్ధిని ఎవ్వ‌రూ మ‌ర్చిపోలేరు. ఇప్పుడు అదే కావూరు ఫ్యామిలీకి చెందిన ఎన్నారై కావూరు లావ‌ణ్య ఏలూరు పార్ల‌మెంటు నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున పోటీకి రెడీ అవుతున్నారు. చాలా త‌క్కువ టైంలోనే నియోజ‌క‌వ‌ర్గం మొత్తం ఫ్లెక్సీలు, ప్ర‌చారంతో ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు ఆమె బాగా దగ్గ‌రైపోయారు.

ఆర్థికంగా కూడా బ‌లంగా ఉండ‌డంతో పాటు ఏలూరు పార్ల‌మెంటుకు లోక‌ల్ కావ‌డం.. ఇటు పోల‌వ‌రంతో పాటు పార్ల‌మెంటు ప‌రిధిలో ఉన్న అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌ల‌పై ఆమెకు విస్తృత‌మైన అవ‌గాహ‌న ఉండ‌డం క‌లిసి రానుంది. పోల‌వ‌రం ప్రాజెక్టు ఇప్ప‌టి కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల పాల‌న‌లో పూర్తి నిర్ల‌క్ష్యానికి గురైంద‌న్న ఆమె కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తేనే పోల‌వ‌రం పూర్త‌వుతుంద‌ని చెప్పారు. మ‌ళ్లీ రైతు రాజ్యం రావాల‌న్నా.. సాగునీటి, తాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాల‌న్నా అది కేంద్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఉంటేనే సాధ్య‌మ‌వుతుంద‌ని లావ‌ణ్య స్ప‌ష్టం చేస్తున్నారు.

బ‌ల‌మైన క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌హిళా నేత‌గా క్లీన్ ఇమేజ్‌తో తొలిసారి ప్ర‌త్యక్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న లావ‌ణ్య అటు రెండు ప్ర‌ధాన పార్టీల‌కు చెందిన టీడీపీ, వైసీపీ అభ్య‌ర్థులు ఇద్ద‌రూ పార్ల‌మెంటు ప‌రిధికి నాన్ లోక‌ల్ అని.. తాను మాత్ర‌మే లోక‌ల్ అని.. వాళ్లు ఎన్నిక‌ల్లో గెలిచినా ఓడినా నియోజ‌క‌వ‌ర్గాన్ని ప‌ట్టించుకోర‌ని.. తాను ఎప్పుడూ ఇక్క‌డే ఉంటాన‌ని చెపుతున్నారు. త‌న‌కు ఓ అవ‌కాశం ఇస్తే పార్ల‌మెంటు ప‌రిధిలో ఉన్న యువ‌త‌కు ఉద్యోగ‌, ఉపాధి అవ‌కాశాల కోసం ప్ర‌త్యేక ప్ర‌ణాళిక‌తో ఉన్న‌ట్టు కూడా తెలిపారు.

ఏదేమైనా కావూరు లావ‌ణ్య ఎంట్రీతో ఏలూరు పార్ల‌మెంటు ప‌రిధిలోనే కాంగ్రెస్‌కు స‌రికొత్త ఊపుతో పాటు క‌ళ వ‌చ్చింద‌న్న‌ది వాస్త‌వం. ఏలూరులో త‌న పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ కార్యాల‌యం ప్రారంభించ‌డంతో పాటు ఏడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారానికి విస్తృతంగా ఖ‌ర్చు పెడుతూ ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నారు. మ‌రి ఆమె ఏలూరు కాంగ్రెస్‌కు ఏ స్థాయిలో ఊపు తెస్తారో ?  ఎన్నిక‌ల్లో ఎంత వ‌ర‌కు ప్ర‌భావం చూపుతారో ?  ఆమె లోక‌ల్ అస్త్రం ఆమెకు ఎన్ని ఓట్లు తెచ్చిపెడుతుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: